- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పాలన
- అడుగడుగునా ఆలేరులో అరాచకం
- అమలు కానీ హామీలతో కాంగ్రెస్ మోసం
- ఆరు గ్యారంటీల అమలు ఏది..?
- భయభ్రాంతులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నేతలు
- స్వర్ణ యుగంలా కేసిఆర్ పాలన
- పల్లెల్లో తిష్ట వేసిన సమస్యలు
- ఎన్నికల్లో గులాబీ జెండానే రెపరెపలాడించాలి
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి
ఆంధ్రప్రభ, ప్రతినిధి/యాదాద్రి : ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రభుత్వం పాలన కొనసాగుతుండగా ఆరు నెలల్లోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన ఏకైక ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి… అధికారంలోకి రాగానే హామీలన్నీ విస్మరించి మోసం చేసిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందన్నారు.
కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగమని, నేడు రేవంత్ రెడ్డి పాలన రాక్షతత్వన్ని తలపిస్తుందన్నారు. నాడు పల్లెలు పచ్చని తోరణంలా స్వాగతం పలికితే, నేడు గ్రామాల్లో నిధులు లేక పారిశుద్యం అస్తవ్యస్తంగా మారిదన్నారు.
రాష్ట్ర అభివృద్ధి రెండు సంవత్సరాలుగా తిరుగమనంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మాట తప్పిందని, కాంగ్రెస్ కు గ్రామాల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. పంచాయితీ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని, ఊరురా గులాబీ జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు.
అపహాస్యం చేస్తున్న పాలకులు..
ప్రజాస్వామ్యాన్ని పాలకులు అపహస్యం చేస్తున్నారని రామచంద్రారెడ్డి ఆరోపించారు.. స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో విప్ బీర్ల ఐలయ్య ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేసి నువ్వు ఎలా గెలుస్తావు.. గెలిస్తే కోర్టుల చుట్టూ తిప్పుతాం అంటూ బహిరంగ ప్రకటనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలేరులో రోజురోజుకు అరాచకం పెరిగిపోతుందని చెప్పారు. శాంతియుత వాతావరణంలో ఉన్న ఆలేరు నియోజకవర్గాన్ని అల్లకల్లోలం చేస్తూ హింసను ప్రేరేపించడం మంచిది కాదని పరోక్షంగా హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పాలకులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు..
పాడి రైతులకు పాల బిల్లులేవి..?
మదర్ డెయిరీలో పాలు పోస్తున్న పాడి రైతుల బిల్లులు చెల్లించడం చేతగాని తనంలో చైర్మెన్ ఉన్నాడని రామచంద్రారెడ్డి అన్నారు. బకాయిల చెల్లింపుల కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆర్థికంగా, తీవ్రంగా నష్టపోయి బ్రతుకే దినదిన గండంగా మారిన పాడి రైతులకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో అస్తవ్యస్తంగా మారిన మదర్ డైయిరీని కొత్త రూపురేఖలతో పునఃనిర్మాణం చేసి పాడి రైతుల పూర్తి బకాయిలను త్వరలో చెల్లించాలని డిమాండ్ చేశారు..
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి..
రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమయ్యిందని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని, పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.4 వేలు పెంచుతామని చెప్పారని, ఆడపిల్లలకు స్కూటీ లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కళ్యాణ లక్ష్మికి నిధుల కొరత ఉందని, రూ.లక్షతో పాటు తులం బంగారం ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. ఊరురా గులాబీ జెండాను ఎగరేసే విధంగా ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

