నంద్యాల బ్యూరో, జూలై 2 (ఆంధ్రపభ) : రాయలసీమ ప్రాంతానికి కాకుండా తెలంగాణకు కూడా సాగు, తాగునీటికి ఉపయోగపడే ప్రముఖ జలాశయమైన శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) భారీగా వరద పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి నీరు ఉధృతంగా వస్తోంది. గత 20రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో జలాశయం నిండుకుంది. బుధవారం జలాశయంలోకి ఇన్ ఫ్లో 4.96 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం నిండుకుండలా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం 882 అడుగులకు చేరుకుంది. మూడు అడుగుల మేర వస్తే డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టడానికి చేరుకుంటుంది.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.4941 టీఎంసీలుగా జలాశయంలో ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో నీరు అధిక సంఖ్యలో జలాశయంలోకి వస్తున్నాయి. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాల మూలంగా తుంగభద్రా నది (Tungabhadra River) పొంగి పొర్లుతుంది. పైన నిండుకున్న డ్యామ్ నుంచి కూడా నీళ్లు జలాశయంలోకి వదిలారు.

ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తికి నీరు… పోతిరెడ్డిపాడుకు నీరు వదలని వైనం.
శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నుంచి కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి (Power generation) ని ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ పవర్ హౌస్ నుంచి 15,836 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. తెలంగాణ పవర్ హౌస్ నుంచి 33,635 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. దీంతో అధికారులు ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు అధికారులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి కి నీరు వదిలినప్పటికీ పోతిరెడ్డిపాడు (Pothireddypadu) , రాయలసీమ ప్రాజెక్టులకు నీరు వదలకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్ సీజన్ లో పంటలకు తుంగభద్ర, శ్రీశైలం రిజర్వాయర్లు సమృద్ధిగా నీటిని నిలువ చేసుకుంటున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ లో ఇప్పటికే 99శాతం నీరు నిల్వ ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ప్రధాన రిజర్వాయర్ లోకి వరదనీరు రావటం పట్ల అయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక పరివాహ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణానది జలకలను సంతరించుకుంది. జూరాల (Jourala) నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala) జిల్లా బీచుపల్లి వద్ద నిండుగా కృష్ణనది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. వర్షాలు కురి య నప్పటికీ ప్రాజెక్టులు నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని రైతులకు కూడా రాయలసీమ ప్రాజెక్టు నీళ్లు వదలాలని రైతులు కోరుతున్నారు.