Srisailam | నాలుగో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు… పోటెత్తుతున్న భక్త జనం
కర్నూలు బ్యూరో – శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన శనివారం ఉదయం శ్రీ స్వామిఅమ్మ వార్లకు విశేషపూజలు నిర్వహించారు. లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు నిర్వహించడం జరిగింది. ఇక ఉదయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం, కాణిపాకం తరపున శనివారం ఉదయం పట్టువస్త్రాలను సమర్పించారు. కాణిపాక దేవస్థానం తరుపున ఆ దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె. పెంచలకిషోర్ ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ఈ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు. తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాణిపాక దేవస్థాన అధికారులు, అర్చకులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకదేవస్థాన స్థానాచార్యలు ఫణికుమారశర్మ, అర్చకస్వాములు గణేశ్ గురుకుల్, వేదపండితులు అభిరామ, అన్నపూర్ణయ్య, పర్యవేక్షకులు కె. కోదండపాణి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాలలో స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకోవడం వలన ఎంతో ఆధ్యాత్మికానుభూతి కలిగిందన్నారు. కాణిపాక దేవస్థానం తరుపున శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు.
ఇక సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఇక నేటి సాయంత్రం మయూరవాహనసేవలో స్వామి అమ్మవార్లు తరించనున్నారు. సాయంకాలం గ్రామోత్సవం నిర్వహించనుండగా ఇందులో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంది.ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను ప్రత్యేకంగా చేపట్టనున్నారు.