- ఇక సిక్కోలు జిల్లా ఆధ్యాత్మికే
- కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం , ఆంధ్రప్రభ బ్యూరో : ప్రముఖ శ్రీకూర్మం ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.
శ్రీ కూర్మ నాధుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాన్ని, తీర్థ ప్రసాదనలను అందజేశారు. అనంతరం ఆలయ పరిసరాలను కేంద్రమంత్రి పరిశీలించారు. పురాణ ప్రాశస్త్యత గురించి తెలుసుకున్నారు. పుష్కరిణి పరిసర ప్రాంతాలను ఎలా వృద్ధి చేయొచ్చో క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. అవసరమైన సూచనలు చేశారు.
శ్రీ కూర్మ క్షేత్రానికి మహర్దశ
ఈ సందర్భంగా మీడియా తో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, .. శ్రీ కూర్మనాథ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే పూజలు జరిగే 7వ శతాబ్దానికి చెందిన ఏకైక పురాతన కూర్మనాథ ఆలయాన్ని మరింత వృద్ధి చెయ్యాల్సిన అవశ్యకత ఎంతో ఉందని స్పష్టం చేశారు.
ఆలయ అభివృద్ధి కోసం బోర్డు మెంబర్లు, స్థానికులు, జిల్లా అధికారులతో కలసి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు. గోడలు, స్తంభాలు, కొన్ని చోట్ల విగ్రహాలను జీర్ణోద్ధారణ చెయ్యాల్సిన పరిస్థితిని వివరించారు. ఇందుకోసం ఈ ప్రాశస్యత తెలిసిన నిపుణులతో పనులను చెయ్యాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు.
ఆలయ విశిష్టతను మరో మెట్టు ఎక్కించేలా.. సంప్రదాయాలకు భంగం కలుగకుండా వ్యవహారాన్ని నడిపే వ్యక్తులు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఇప్పటికే శోధించారని తెలిపారు. ఆలయ ధర్మకర్తగా ఉన్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఇప్పటికే ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు.
ఆలయ పునరుద్ధరణతో పాటు, నిత్యాన్నదానం, అభివృద్ధి, పిండ ప్రధానం కోసం కొత్త భవనం, పుష్కరణి ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇందులో మొదటి విడతగా శ్వేత పుష్కరిణీ, పిండ ప్రధాన ప్రాంతంలో భవనం, పార్కింగ్ ప్రాంతాలను అభివృద్ధి చెయ్యనున్నారు.
ఇందుకోసం ఇండిగో సంస్థ సి.ఎస్.ఆర్ నిధుల నుండి పది కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్టు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి ఖాయం
శ్రీకూర్మ క్షేత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి అవకాశం ఉందని.. ఆలయంలో అభివృద్ధి లేదు అని బాధపడేవారు మరికొద్ది రోజుల్లో కొత్త శ్రీకూర్మం ను చూస్తారని స్పష్టం చేశారు. శ్రీకాకుళం పరిసర ఆలయాలలో టూరిజం ను అభివృద్ధి చేస్తే జిల్లా అభివృద్ది సైతం సాధ్యం అవుతుందని, పురాతన ఆలయాల్లో భక్తులకు మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోడ్పాటుతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం, దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందని, డబుల్ ఇంజన్ సర్కారు.. డబుల్ స్పీడ్ తో వెళ్తతోం దని తెలిపారు. ప్రధాని మోదీ పాలన లో ఈ పదహారు నెలలు మరింత ప్రత్యేకమైనదని.. అభివృద్ది విషయంలో రాష్ట్రం ఒక అడుగు వేస్తే కేంద్రం రెండు అడుగుల సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు.