వైద్య విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరం..

వైద్య విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరం..
ప్రతి మెడికల్ కాలేజీకి రూ.10 లక్షలు: వీసీ పి.చంద్రశేఖర్.
కర్నూలు, ఆంధ్రప్రభ : వైద్య విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలపై దృష్టి సారించడం అత్యంత అవసరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో సోమవారం నిర్వహించిన సమావేశంలో స్పోర్ట్స్ కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఇతర కాలేజీల విద్యార్థులతో పోటీ పడే అవకాశాలు లభిస్తాయని, తద్వారా వ్యక్తిగత నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
శారీరక దారుఢ్యం ఉన్నప్పుడే జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరని పేర్కొన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ తన మాతృసంస్థ అని పేర్కొన్న వీసీ, ఇటీవల యూనివర్సిటీ స్థాయి క్రీడల్లో విద్యార్థులు సాధించిన విజయాలను అభినందించారు. కాలేజీ స్పోర్ట్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రతి సంవత్సరం రూ.10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

అదనంగా రూ.2 లక్షలను నాణ్యమైన స్పోర్ట్స్ సామగ్రి కొనుగోలుకు అందజేస్తామని తెలిపారు. కాలేజీలో తలెత్తే సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలని, బయటి జోక్యం సమస్యలను మరింత క్లిష్టం చేస్తుందని సూచించారు. అడిషనల్ డీఎంఈ, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే. చిట్టి నరసమ్మ మాట్లాడుతూ విద్యార్థులు వైద్య విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీ స్థాయి పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారని చెప్పారు.

ఇప్పటికే స్పోర్ట్స్ అభివృద్ధికి రూ.3 లక్షల పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ త్రిమూర్తులు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రేణుక, డాక్టర్ శ్రీరాములు, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మి, డాక్టర్ నాగేశ్వరరావు, స్పోర్ట్స్ కమిటీ ప్రతినిధులు డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ విజయశంకర్ తదితరులు, పీజీ, యూజీ విద్యార్థులు పాల్గొన్నారు.
