Speaker | గాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం

Speaker | గాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం

  • జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు… వాళ్లే బి.ఫాంలు పంచుతున్నారు
  • మీ కళ్లకు కన్పించడం లేదా స్పీకర్
  • స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా?
  • ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయండి
  • కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారట
  • కేంద్ర మంత్రి బండి సంజయ్

Speaker | సిరిసిల్ల, ఆంధ్రప్రభ : ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ ఆయా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమన్నారు. స్పీకర్ సమీరు నిజాయితీ పరులు మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నరు, జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్ లు పెడుతున్నారు అభ్యర్థుల చేతికి కాంగ్రెస్ బీఫాంలు ఇస్తున్నారన్నారు.

కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నిలదీయాలన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలి ఏ అభ్యర్ధిని గెలిపించాలని నిలదీయండన్నారు. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండిని పిలుపునిచ్చారు.

Speaker |

కేటీఆర్ సిరిసిల్లలో అడ్డా పెట్టారు

మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నడట. ఆ డబ్బులు మనవే తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించాలన్నారు. మొన్నటిదాకా సిరిసిల్ల మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కు అప్పగిస్తే ఏం జరిగిందన్నారు. వానొస్తే గల్లీలన్నీ మునిగిపోతున్నాయని, ఆఖరికి జిల్లా కలెక్టరేట్ కూడా మునిగిపాయి పడవల్లో, ట్రాక్టర్లలో పోవాల్సిన దుస్థితి ఉన్న విషయం మీకు తెలిసిందే అన్నారు.

కమిషన్ల కోసమే నూలు డిపో వేములవాడలో

వస్త్ర పరిశ్రమ మొత్తం సిరిసిల్లలో ఉంటే నూలు డిపోను వేములవాడలో పెడతారా. డిపో ఈడ పెడితే వాళ్ల కమీషన్లన్నీ తెలుస్తదని ఆడ పెట్టిర్రు. ప్రతి కిలో పై కాంగ్రెస్ నేతలు కమిషన్లు దొబ్బుతున్నరు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సిరిసిల్లలో ఒక్కటంటే అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు లాంటి మౌలిక వసతులు కల్పనలో కాంగ్రెస్ విఫలమైంది.

వస్త్ర పరిశ్రమ పరిస్థితి దారుణం

ఇక టెక్స్టైల్ పార్క్ పరిస్థితి దారుణంగా ఉంది. పరిశ్రమలు మూతపడ్డాయి. 220 యూనిట్లు నడవాల్సి ఉంటే ఇప్పుడు, పది షెడ్లలో పని ఉంది. 200 షెడ్లు మూతపడ్డాయి. నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

కేంద్ర నిధులు వృధా చేస్తున్నరు

ఇప్పటి వరకు 14, 15వ ఆర్ధిక సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి దాదాపు 29 కోట్లు ఇచ్చినం. అమ్రుత్ పథకం ద్వారా రూ.50 కోట్లు ఇచ్చినం. మేం ఇంత పెద్ద ఎత్తున పైసలిస్తే సక్రమంగా వినియోగించకుండా డబ్బులన్నీ వ్రుధా చేస్తున్నరు. కమీషన్లు సంపుకుంటున్నరు. పైప్ లైన్ పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినయ్.ప్రధానమంత్రి స్వనిధి ద్వారా ఈ సిరిసిల్ల పట్టణంలోని 11 వేల 737 మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు 21 కోట్ల 52 లక్షలు ఇచ్చినం.

స్వచ్ఛ భారత్ ద్వారా ఈ మున్సిపాలిటీకి రూ.44 లక్షలు ఇచ్చినం. సిరిసిల్లకు వరదల లెక్క కేంద్రం నిధులు తీసుకొస్తే…సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నరు. ఇగ కాంగ్రెస్ ను అడుగుతున్నా… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశారా? మహిళలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? అసలు ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలున్నయా? నన్ను కోసినా నయాపైసా ప్రభుత్వం వద్ద లేదని సీఎం రేవంత్ రెడ్డే చెప్పిండు. మరి యాడ నుండి తీసుకొచ్చి అభివ్రుద్ది చేస్తరు? నిధులు ఇచ్చేది కేంద్రం… తెచ్చేది నేనే. మీరు సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే… పెద్ద ఎత్తున నిధులిస్తానని మోదీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply