SPACE | అంతరిక్ష విజ్ఞాన వీచిక…

‘స్పేస్ ఆన్ వీల్స్’ ఆకర్షణ
ఆంధ్రప్రభ, విజయవాడ: అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విద్యార్థులు, యువతలో ఆసక్తిని పెంపొందించేందుకు రూపొందించిన స్పేస్ ఆన్ వీల్స్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదివారం సందర్శించారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన ఆయన, అంతరిక్షంపై సానుకూల దృక్పథాన్ని పెంచేలా ఇది ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) ఆధ్వర్యంలో స్పేస్ ఆన్ వీల్స్ విజయవంతంగా పర్యటిస్తోందని, విద్యార్థుల విస్తృత ప్రయోజనం దృష్ట్యా ఇది రెండు రోజులపాటు (ఆదివారం, సోమవారం) ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ ప్రదర్శనలో భారత తొలి ఉపగ్రహ వాహక నౌక నుంచి తాజా ఇస్రో ప్రయోగాల వరకు, లాంచ్ప్యాడ్లు, చంద్రయాన్, మంగళయాన్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి విభాగాలకు సంబంధించి వివిధ నమూనాలు, సమాచార ప్రదర్శనలు ఏర్పాటు చేశారని కలెక్టర్ వివరించారు. వీటిని చూసి విద్యార్థుల్లో అంతరిక్ష శాస్త్రంపై అవగాహనతో పాటు ఆసక్తి కూడా పెరుగుతుందని అన్నారు.
కార్యక్రమంలో షార్ టెక్నికల్ అధికారి కిరణ్ పాల్గొన్నారు. స్పేస్ ఆన్ వీల్స్‌ను సందర్శిస్తున్న విద్యార్థులకు భారత అంతరిక్ష సాధనల విజయగాథను కిరణ్ విశదీకరించారు.
