SP Tushar Dudi | పోలీసుల శ్రమదానం

SP Tushar Dudi | పోలీసుల శ్రమదానం
- స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛత దివస్‌లో పూతలపట్టు పోలీసులు
SP Tushar Dudi | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహించే “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛత దివస్” కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల ప్రకారం శనివారం పూతలపట్టు మండల పరిసర ప్రాంతాల్లో పూతలపట్టు పోలీసులు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పూతలపట్టు పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గోపి నేతృత్వంలో వీధుల్లో చెత్త తొలగింపు చేపట్టి, ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. గ్రామాలు, వీధులు, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా పోలీసులు స్వయంగా శ్రమించి, పరిశుభ్రతకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ గోపితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో తమవంతు బాధ్యతగా పనిచేశారు. చెత్తను ఎక్కడికక్కడ వేయకుండా, నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వేసే విధంగా ప్రజలకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గోపి మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలంతా స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరించి, తమ ఇళ్లు, వీధులు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని పోలీసులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని పోలీసులు స్పష్టం చేశారు.
