నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా (Nandyal District) నూతన ఎస్పీ సునీల్ షెరాన్ (SP Sunil Sheran) ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ షెరాన్‌కు నంద్యాల జిల్లా పోలీస్ అడిషనల్ ఎస్పీ, నంద్యాల ఏఎస్పి మంద జావళి ఆల్ఫోన్స్, నంద్యాల, ఆళ్లగడ్డ(Allagadda), ఆత్మకూరు, డోన్ డీఎస్పీ స్వాగతం పలికారు. ఇప్పటి వరకూ నంద్యాల జిల్లా ఎస్పీగా పని చేసిన ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణ 2024 జూలైలో 14 నెలలు పని చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ (Vijayawada)లోని పోలీస్ హెడ్ క్వార్టర్ (Police Headquarters)లో రిపోర్ట్ చేయనున్నారు.

నూతన ఎస్పీకి సవాళ్లెన్నో…
నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మూడో ఎస్పీగా సునీల్ వచ్చారు. తొలి జిల్లా ఎస్పీగా రఘువీరారెడ్డి, రెండవ ఎస్పీగా అది రాజ్ సింగ్ రాణా పనిచేశారు. మూడో ఎస్పీగా సునీల్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నిక్కచ్చిగా ముక్కుసూటి ఐపీఎస్ అధికారి (IPS Officer) గా మంచి పేరు ఉన్న సునీల్ రాకతో జిల్లాలో పలు మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. రౌడీ షీటర్లలోను అసాంఘిక శక్తుల పట్ల వత్తాసు పలికేవారిలో వణుకు ప్రారంభమైందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు . గతంలో జిల్లాలో విచ్చలవిడిగా మట్కా (Matka), అక్రమ వ్యాపారాలపై నిఘా లోపించిందని నంద్యాల ప్రజల్లో ఓ అభిప్రాయం ఉంది.

ముఖ్యంగా మట్కా, బియ్యం కేసులు తక్కువ నమోదు కావడం జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.అంతేకాకుండా, ఇటీవల కాలంలో జిల్లాలో పోక్సో కేసులు పెరిగి పోవడంతో జిల్లాలోని చట్టవ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. మహిళల భద్రత, బాలల రక్షణలో పోలీసులు చురుగ్గా వ్యవహరించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అధిక వడ్డీ వ్యాపారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేదని జిల్లా ప్రజల నుంచి ఆరోపణలు వినిపించాయి. నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సునీల్ పై జిల్లా ప్రజలు కొండంత ఆశతో ఉన్నారు.


