Soybean farmers’ agitation | అట్టుడికిన ఆదిలాబాద్

Soybean farmers’ agitation | అట్టుడికిన ఆదిలాబాద్
- సోయా కొనుగోళ్లు చేపట్టాలని ఎంపీ, ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడి
- ఉద్రిక్తతకు దారి తీసిన ఆందోళన
- బీఆర్ఎస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య ఘర్షణ
- ఇదరు కానిస్టేబుళ్లకు, ఎనిమిది మంది కార్యకర్తలకు గాయాలు
- మాజీ మంత్రి జోగు రామన్న సహా 80 మంది అరెస్టు
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : సోయా కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తకు దారి తీసింది. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. రైతు పోరుబాటలో భాగంగా ఈ రోజు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్ నివాసాలను ముట్టడించేందుకు ప్రయత్నించారు.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకాలను అడ్డుకున్నారు. ఈ దశలో బారికెట్లను దాటి ఆందోళనకారులు దూసుకుపోవడంతో పోలీసులు వారిని చెదరగొడుతూ నానా ఆవస్తలు పడ్డారు. అనంతరం ఎంపీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించవారికి మధ్య వివాదం చోటు చేసుకుంది. వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న సహా 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

సోయా కొనుగోళ్లలో కేంద్రం, రాష్ట్రం దొంగాట : జోగు రామన్న

పంట దిగుబడి లేక నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అతిగా ప్రవర్తించి అరెస్టు చేయడం శోచనీయమన్నారు. రంగు మారిన ధాన్యాన్ని మార్క్ఫెడ్, నాఫెడ్ కొనుగోలు చేయాలని, ఎంపీ, ఎమ్మెల్యేలు రైతు సమస్యల విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
అనంతరం వన్ టౌన్, టూ టౌన్, మావల పోలీస్ స్టేషన్ లకు ఆందోళనకారులను తరలించారు. అక్కడ కూడా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ ఆందోళనలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల బిఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, మా చిట్టి గోవర్ధన్, గంభీర్, మాజీ జెడ్పిటిసి దేవన్న, సాజిడోద్ది న్, అజయ్ , గండ్రత్ రమేష్, జంగిలి ప్రశాంత్, దేవిదాస్ , మెట్టు ప్రహ్లాద్, యూనుస్అబ్బానీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
