యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.!

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.!
అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేసే వ్యవస్థలపై ఉక్కు పాదం మోపుతామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం లో గంజాయి తరలిస్తూ పట్టుబడిన అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
యువత గంజాయి మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హితవు పలికారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల పమిడిముక్కల మండలంలో పట్టుబడిన అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా చేసే ముఠా సభ్యులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సమావేశంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ తెనాలి ప్రాంతానికి చెందిన మనబోటి ఈశ్వర ప్రసాద్ తమిళనాడుకు చెందిన దురై మోహన్ కుమార్ విశాఖపట్నంకి చెందిన అల్లా అమీన్ లు గతంలో తమిళనాడు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో స్నేహితులుగా మారారన్నారు.
సులభ పద్ధతిలో డబ్బును సంపాదించాలనే దురుద్దేశంతో గంజాయి సరఫరాను ఎంచుకున్నారన్నారు.నిందితులు ముగ్గురు కలిసి 52 కేజీల గంజాయి 26 ప్యాకెట్లుగా పార్సిల్ చేసి కారులో తరలిస్తున్న క్రమంలో తోట్లవల్లూరు ఎస్సై పి కిషోర్ నేతృత్వంలోని సిబ్బంది అంతర్ రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రెండు లక్షల అరవై వేల మేర ఉంటుందని తెలిపారు.
గంజాయి సరఫరాకు వినియోగించిన కారు నిందితులకు చెందిన మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకున్నట్లు వెల్లడించారు. యువతను మత్తుపదార్థాలకు బానిసలు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు.గంజాయిని తరలిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభను చాటిన తోట్లవల్లూరు పోలీస్ సిబ్బందిని అభినందించారు.
