ఎస్‌ఎల్‌బీసీకి మళ్లీ ఊపిరి

ఎస్‌ఎల్‌బీసీకి మళ్లీ ఊపిరి

  • జేపీ కంపెనీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ సొరంగ త్రవ్వకం

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి ఎస్‌ఎల్‌బీసీ అవుట్‌లెట్ టన్నెల్‌లో మంగళవారం నుంచి టన్నెల్ త్రవ్వకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత ఏడాది జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో నిలిచిపోయిన పనులు, సుదీర్ఘ అధ్యయనాలు, ఆధునిక సాంకేతిక సర్వేలు పూర్తయ్యాక తిరిగి మొదలుకావడం ఈ ప్రాంత రైతుల్లో ఆశలు నింపుతోంది.

ప్రపంచంలోనే అతి పెద్ద టన్నెల్ ప్రాజెక్టులలో ఒకటైన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు, శ్రీశైలం జలాశయంలోని ఎడమ గట్టు కాలువ నుంచి నల్లగొండ జిల్లా రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు త్రాగునీరు అందించాలనే సంకల్పంతో 2004 సెప్టెంబర్ 14న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే ప్రారంభం నుంచి అనేక సాంకేతిక, భౌగోళిక అడ్డంకులతో ఈ ప్రాజెక్టు అష్టకష్టాలు పడుతూ సాగుతోంది.

ఈ నేపథ్యంలో గత ఏడాది ఫిబ్రవరి 22న దోమలపెంట ఇన్‌లెట్ టన్నెల్‌లో 14వ కిలోమీటర్ వద్ద అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసు శాఖలు సమిష్టిగా 40 రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి ఇద్దరు ఇంజినీర్ల మృతదేహాలను వెలికితీశాయి. అయితే మిగిలిన కార్మికుల మృతదేహాలను వెలికితీయడం భౌగోళిక పరిస్థితుల కారణంగా అసాధ్యమని నిపుణులు తేల్చడంతో ఆ ప్రయత్నాలు నిలిపివేయాల్సి వచ్చింది.

తర్వాత పరిస్థితులపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్ 3న మన్నెవారిపల్లి అవుట్‌లెట్ టన్నెల్ వద్ద హెలీ ఎయిర్‌బోర్న్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ టెక్నాలజీ ద్వారా హెలికాప్టర్ సర్వే చేపట్టారు. ఈ సర్వే నివేదికను నవంబర్ 12 నాటికి ప్రభుత్వానికి సమర్పించారు. నివేదిక ఆధారంగా మిగిలిన 9.53 కిలోమీటర్ల టన్నెల్ త్రవ్వకాన్ని పర్యావరణానికి, అభయారణ్యంలో ఉన్న జంతుజాలానికి ఎలాంటి ముప్పు కలగకుండా చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏటీఎం (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మెథడ్) పద్ధతిలో పనులు సాగుతున్నాయి. భారత ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, కర్నల్ పరీక్షిత్ మెహ్రా మార్గదర్శకత్వంలో దాదాపు 30 మంది నిపుణులు సొరంగంలో పని చేస్తున్నారు.

ఈ పనులు అదాని కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్న ప్రచారాన్ని జేపీ కంపెనీ అధికారులు ఖండించారు. “టన్నెల్ త్రవ్వకం పనులు పూర్తిగా జేపీ కంపెనీ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ఇతర సంస్థల పాత్ర లేదని” స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తయితే నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటి సమస్య తీరడమే కాకుండా, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందే అవకాశం ఉంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు మళ్లీ ముందుకుసాగుతుండటం, ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

Leave a Reply