SL vs BAN | శ్రీలంక విజృంభణ.. బంగ్లాపై ఇన్నింగ్స్ విజ‌యం !

కొలంబో వేదికగా బంగ్లాదేశ్-శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. మ్యాచ్‌ నాలుగో రోజు తొలుతే బంగ్లాదేశ్‌ను 133 పరుగులకు ఆలౌట్‌ చేసి.. ఇన్నింగ్స్‌ 78 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టు డ్రా అవ్వ‌గా… ఈ విజయంతో శ్రీలంక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

ముందుగా టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ వారికి కావలసిన పెద్ద భాగస్వామ్యాలు సాధ్యపడలేదు. ఓపెనర్‌ షాడ్‌మన్‌ ఇస్లాం (46) మినహా మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. శ్రీలంక తరఫున అరంగేట్రం చేసిన సోనాల్‌ దినుష (3/22), ఆసితా ఫెర్నాండో (3/51) బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్ లో 247 పరుగులకే కట్టడి చేశారు.

ఆ తర్వాత శ్రీలంక బ్యాటర్లు జైత్రయాత్ర ప్రారంభించారు. పాతుమ్‌ నిసాంక (158) శతకంతో చిత‌కొట్టాడు. దినేశ్‌ చంద్రిమల్‌ (93), కుసల్‌ మెండిస్‌ (84) శతకాలు మిస్‌ అయినా బంగ్లా బౌలర్లపై బాదేసారు. బంగ్లాదేశ్ స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం 5 వికెట్లు తీసి తన 17వ టెస్టు ఫైఫర్‌ను సాధించాడు. అయినా శ్రీలంక త‌మ తొలి ఇన్నింగ్స్ లో 458 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

మూడో రోజు టీ విరామం తర్వాత బ్యాటింగ్‌ మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌కు ఆరంభం నుండి ఎదురుదెబ్బలు తగిలాయి. శ్రీలంక‌ స్పిన్నర్లు ప్రభాత్‌ జయసూర్య, కెప్టెన్‌ ధనంజయ డిసిల్వా, తరిందు రత్నాయకే వరుసగా వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను మూడో రోజు 115/6 వద్ద నిలిపేశారు.

చివరి రోజు ఉదయం కూడా శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించారు. శ్రీలంక బౌలర్ల ధాటికి.. బంగ్లాదేశ్ బ్యాట‌ర్లు ఎవరూ కనీసం 30 పరుగులు దాటలేకపోయారు. ఫలితంగా, బంగ్లాదేశ్ 133 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో, శ్రీలంక ఇన్నింగ్స్ & 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతుల్య ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీలంక, పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి, త‌మ సొంత గడ్డపై సిరీస్‌ను కైవసం చేసుకుంది.

కాగా, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య బుధవారం నుంచి మూడు వన్డేల సిరీస్, జూలై 10 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానున్నాయి.

Leave a Reply