హైదరాబాద్ : సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)కి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఈ విషయాన్ని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు.
ఈ కేసులో మొత్తం ఎనిమిది FIRలు నమోదు అయ్యాయని డీసీపీ వివరించారు. ఇప్పటివరకు కేసులో 25 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. అరెస్టైనవారిలో డాక్టర్లు, ఏజెంట్లు ఉన్నారటి డీసీపీ తెలిపారు.
విశాఖపట్నంలో సరోగసీ పేరుతో మోసం జరిగినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని హాస్పిటల్‌ను కేవలం కన్సల్టెన్సీ కోసం మాత్రమే వాడుకున్నారని, IVF పేరుతో శాంపిల్స్ తీసుకొని మిగతా సరోగసీ ప్రాసెస్‌ను వైజాగ్‌లో నిర్వహించారని తెలిపారు.
ఒక కేసులో సృష్టి యాజమాన్యం బాధితులకు చనిపోయిన శిశువును చూపించిందని, మరో కేసులో రూ.15 లక్షలు అదనంగా డిమాండ్ చేసినట్లు తెలిపారు.
సరోగసీ ద్వారా ఆడపిల్ల పుట్టిందనే వాదన అబద్ధమని డీఎన్ఏ పరీక్షలు నిర్ధారించాయని డీసీపీ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పలువురు వైద్యుల ప్రమేయం ఉన్నట్లు ఆమే తెలిపారు. వైజాగ్‌కు చెందిన డా.విద్యులత, డా.రవి, డా.ఉషలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
అరెస్టైన వారిలో పలువురు మహిళలు ఉన్నారని, వీరిలో కొందరు అండాలు అమ్ముకున్నవారు, మరికొందరు సరోగసీ తల్లులుగా నటించినవారని డీసీపీ వివరించారు.
దంపతులు సరోగసీ కోసం సంప్రదించినప్పుడు, కొన్నిరోజుల తర్వాత ఫేక్ అల్ట్రాసౌండ్ రిపోర్టులు పంపించి, గర్భిణిని వెతికిపెట్టి, 9 నెలల తర్వాత వైజాగ్‌లో డెలివరీ జరిపి, ఆ శిశువును సరోగసీ పాపగా చెప్పి అప్పగించే మోసపూరిత పద్ధతి నడిచిందని ఆమె పేర్కొన్నారు.
ఇలాంటి సెంటర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమతులు ఉన్న వాటినే సంప్రదించాలని డీసీపీ సూచించారు.