Singareni | కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలో సింగరేణి తొలి అడుగు !

  • సిఎస్ఐఆర్ – ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీతో ఉమ్మడి అవగాహన ఒప్పందం

సింగరేణి సంస్థ‌ కీలకమైన ఖనిజ రంగంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో, (గురువారం) భువనేశ్వర్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన CSIR (Council of Scientific and Industrial Research), దాని అనుబంధ సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.

ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నీతి ఆయోగ్ సభ్యులు, మాజీ డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్, పద్మభూషణ్ వీకే సారస్వత్ సమక్షంలో జరిగిన ఒప్పంద సమావేశంలో సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్. బలరామ్, సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ డైరెక్టర్ డాక్టర్ రామానుజ్ నారాయణ్, రెండు సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు సింగరేణి తన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో భాగంగా కీలకమైన ఖనిజాల రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించిందని, ఈ సందర్భంలో ఈ ఒప్పందం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని ఎండీ ఎన్. బలరామ్ వివరించారు.

సింగరేణి కంపెనీ గనులు, సింగరేణి ప్రాంతాలలో ఉన్న వివిధ ర‌కాల‌ కీలక ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కోసం ఉమ్మడి భాగస్వామ్య పద్ధతిలో ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లు ఆయన తెలిపారు. ఉత్పత్తి సమయంలో పూర్తి పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కూడా ఒప్పందంలో పొందుపరచడం జరిగిందన్నారు.

అంతేకాక ఆస్ట్రేలియాతో కూడా కీలక ఖనిజాల ఉత్పత్తికి సంబంధించి అవగాహనకు వచ్చామని, దీనిలో కూడా ఐఎంఎంటి సేవలు వినియోగించే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశీయంగా కీలక ఖనిజాల ఉత్పత్తి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ కూడా తన వంతుగా కొన్ని బ్లాకులను చేపట్టడానికి సర్వసన్నద్ధమై ఉందని తెలియజేశారు.

Leave a Reply