Singareni | రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తే సింగరేణి భవిష్యత్తు
- బెల్లంపల్లి శాంతిఖని బొగ్గుగనికి ఉజ్వల భవిష్యత్తు
- కార్మికులు రక్షణ సూత్రాలు పాటించాలి
- శాంతిఖనిలో జరిగిన రక్షణ వారోత్సవాల్లో పర్యావరణ కార్పొరేట్ జీఎం బి. సైదులు
Singareni | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సింగరేణి సంస్థలో ప్రమాద రహిత వాతావరణం నెలకొల్పితేనే సంస్థకు భవిష్యత్ ఉన్నదని సింగరేణి(Singareni) పర్యావరణ విభాగం కార్పొరేట్ జీఎం, రక్షణ వారోత్సవాల కమిటీ కన్వీనర్ బి. సైదులు స్పష్టం చేశారు. బెల్లంపల్లి శాంతిఖని బొగ్గుగని ఆవరణలో ఈ రోజు నిర్వహించిన 56వ సింగరేణి రక్షణ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రక్షణను కేవలం నినాదంగా కాకుండా ప్రతిరోజూ ఆచరణలో పెట్టినప్పుడే ప్రమాదాలకు తావుండదని చెప్పారు. సంస్థ వ్యాప్తంగా రక్షణ పండుగను ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి కార్మికుడు, ప్రతి అధికారి రక్షణ మార్గదర్శకాలను(safety guidelines) కచ్చితంగా అనుసరించాలని పిలుపునిచ్చారు. “రక్షణే ప్రథమం… రక్షణే భవిష్యత్తు… రక్షణే సర్వస్వం” అని హితబోధ చేశారు. ప్రమాద రహిత సంస్థగా సింగరేణికి పేరు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతాయుత చర్య అవసరమని అన్నారు. “బొగ్గు ఉత్పత్తి జరగాలి… కానీ అది రక్షణతో కూడి ఉండాలని పేర్కొన్నారు.
Singareni | బెల్ట్ 16 గంటలు నడిస్తేనే శాంతిఖని గని మనుగడ
– మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ
శాంతిఖని బొగ్గుగని బెల్ట్ ప్రతిరోజూ కనీసం 16 గంటలు నడిచే పరిస్థితి నెలకొన్నప్పుడే గని మనుగడ సాధ్యమవుతుందని మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ(GM N. Radhakrishna) పేర్కొన్నారు. రక్షణ వారోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏరియా మొత్తాన్ని బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు.
రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్–ఫేస్-2 బొగ్గు తవ్వకాల కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతమైందని, త్వరలోనే పనులు వేగవంతం కానున్నాయని వివరించారు. అలాగే కళ్యాణ్ ఖని ఓపెన్ కాస్ట్ నుంచి రోజుకు కనీసం మూడు రేకు బొగ్గు రవాణా చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయన్నారు.
మందమర్రి ఏరియాలోని కాసిపేట–1, కాసిపేట–2(Kasipeta-1, Kasipeta-2) గనుల్లో ఉత్పత్తి మరుగుస్తోందని, దాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సమన్వయం, రక్షణ, బాధ్యత ఈ మూడింటి సమ్మిళితంతోనే సింగరేణి గనులలో ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావించారు.
రక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ… కార్మికులు తాజా రక్షణ నియమ నిబంధనలను నిరంతరం అభ్యసించి, వాటిని కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ(AITUC) బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఫిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్, డీవైజీఎం పి. శ్రీనివాస్, ఈఅండ్ఎం డీవైఎస్ఈ సముద్రాల శ్రీనివాస్, డీజీఎం బీ. దేశాయి, ప్రాజెక్ట్ అధికారి కదీర్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి పి. రాజు తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు అధికారులు, కార్మికులు రక్షణ ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా రాణిస్తున్న సింగరేణి కార్మికులకు సింగరేణి పర్యావరణ విభాగం కార్పొరేట్ జీఎం, రక్షణ వారోత్సవాల కమిటీ కన్వీనర్ బి. సైదులు, జీఎం మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణలు బహుమతులు పంపిణీ చేశారు.

