Singareni | చరిత్రలో ఆల్ టైం రికార్డ్..

  • ఒక్కరోజులో 3.25 లక్షల టన్నుల బొగ్గు రవాణా
  • ఉద్యోగులను అభినందించిన సీఎండీ బలరాం

సింగరేణి చరిత్రలో శుక్రవారం బొగ్గు రవాణాలో ఆల్ టైం రికార్డు నమోదయింది. మూడు షిఫ్టులలో కలిపి సింగరేణి మొత్తం మీద 3,25,243 టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేశారు. దీనిలో రైల్వే రేకుల ద్వారా గత ఏడాదితో పోల్చితే అత్యధికంగా బొగ్గు రవాణా చేయటం కూడా మరో ఆల్ టైం రికార్డే.

ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్.బలరామ్ హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి శనివారం డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో సమావేశం నిర్వహించి తన అభినందనలు తెలియజేశారు. అందరూ సమష్టిగా కృషి చేయడం వల్లనే ఈ అరుదైన రికార్డు సాధ్యమైందన్నారు.

ఇదే ఒరవడితో వర్షాకాలం వరకు అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలని తద్వారా విద్యుత్ డిమాండ్ కు తగినంత బొగ్గును థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాలన్నారు. రానున్న మూడు నెలల కాలంలో ఇదే విధంగా పని చేస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు గట్టి పునాది వేయాలని సూచించారు.

దేశంలో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతున్నప్పటికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు వీలుగా మన రాష్ట్రం తోపాటు మనతో ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రణాళికాబద్ధంగా సరిపడా బొగ్గును సరఫరా చేయగలిగామన్నారు.

దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 7.24 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని గుర్తుచేశారు. రానున్న రోజుల్లోనూ ఇదే విధంగా అన్ని థర్మల్ కేంద్రాలకు సమృద్ధిగా బొగ్గు సరఫరా చేయడానికి సమష్టిగా కృషి చేయాలన్నారు.

శుక్రవారం అత్యధికంగా బొగ్గు రవాణా జరగడంలో సంస్థ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, అన్ని గనులు, సి.హెచ్.పి.ల అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా కృషి చేసి మంచి ఫలితాలు సాధించారని ఆయన అభినందించారు. కొత్తగూడెం నుంచి ఎక్కువ పరిమాణంలో బొగ్గు సరఫరా చేయడం పై ఆ ఏరియా ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

కొత్తగూడెం వీకే ఓపెన్ కాస్ట్ కు పర్యావరణ అనుమతులు …

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్తగూడెం వెంకటేశ్ ఖని( వీకే) ఓపెన్ కాస్ట్ కు పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులు లభించాయన్నారు. ఈ మేరకు ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో అనుమతులు లభించినట్లు వెల్లడించారు.

వీకే ఓపెన్ కాస్ట్ ను అతి త్వరలో ప్రారంభించుకోబోతున్నామని, అనతి కాలంలోనే రొంపేడు ఓపెన్ కాస్టు (ఇల్లందు) గనికి కూడా అనుమతులు రానున్నాయని, కనుక వచ్చే ఏడాది నిర్దేశిత 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు (పా, పి అండ్ పి), ఈడీ (కోల్ మూమెంట్) ఎస్ డి ఎం.సుభానీ, జీఎం(సీపీపీ) మనోహర్, జీఎం(మార్కెటింగ్) ఎన్.వి.రాజశేఖరరావు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.

Leave a Reply