Singapore Open | సింధు శుభారంభం.. రెండో రౌండ్‌లోకి ప్రణయ్ !

సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, సింగపూర్ ఓపెన్ 2025లో విజయంతో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈరోజు (మంగళవారం) జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో కెనడాకు చెందిన వెన్ యువ్ జాంగ్‌తో త‌ల‌ప‌డ‌గిన సింధు… కేవలం 31 నిమిషాల్లో 21-14, 21-9తో ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది.

పురుషుల పోరులో.. హెచ్‌ఎస్ ప్రణయ్ మంచి ప్రదర్శనతో డెన్మార్క్ ఆటగాడు రాస్మస్ జెంక్‌పై 19-21, 21-16, 21-14 తేడాతో గెలిచి ప్రీ క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించాడు. అయితే, ఈ టోర్నమెంట్‌లో సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ మాత్రమే రెండవ రౌండ్‌కు అర్హత సాధించగా, మిగతా భారత షట్లర్లు తొలిరౌండ్‌లోనే ఇంటి బాటపట్టారు.

మహిళల సింగిల్స్‌ :

తెలంగాణ యువ షట్లర్ అన్మోల్ ఖర్భ్‌కి తొలిరౌండ్‌లోనే కఠినమైన పోటీ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ చెన్ యూ ఫేయి ఎదురుగా ఆడిన ఆమె 11-21, 22-24తో కోల్పోయింది. రెండో గేమ్‌లో అన్మోల్ గ‌ట్టిగా పోరాడినా.. విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.

మరో భారత క్రీడాకారిణి మాలవిక బన్సోద్ తొలి గేమ్‌ను గెలుచుకున్నా, ఆ త‌రువాతి వ‌రుస సెట్ల‌ను థాయిలాండ్‌కి చెందిన సుపనిదా కతెతాంగ్ చేతిలో 21-14, 18-21, 11-21తో ఓటమిపాలయ్యింది.

రక్షితా రామ్‌రాజ్ కూడా జపాన్‌కి చెందిన కోడాయ్ నారోకా చేతిలో 14-21, 8-21తో పోటీలో నిష్క్రమించింది.

పురుషుల సింగిల్స్‌ :

అయితే మరో ఇద్దరు భారత షట్లర్లు ప్రియాంశు రాజావత్, కిరణ్ జార్జ్‌లకు తొలి రౌండ్‌లోనే నిరాశ ఎదురైంది. కిరణ్, చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్ చేతిలో 19-21, 17-21తో ఓడిపోయాడు. ప్రియాంశు నారోకా చేతిలో 21-14, 10-21, 14-21తో ఓటమి పాలయ్యాడు.

మిక్స్‌డ్ డబుల్స్‌ విభాగం:

ధ్రువ్ కపిలా – తనిషా క్రాస్టో జోడీ చైనా జోడీ చెంగ్ షింగ్ – జాంగ్ చీ చేతిలో 18-21, 13-21తో ఓడిపోయింది.

అదే విధంగా అశిత్ సూర్య – అమృత ప్రముతేష్ జోడీ జపాన్ జంట చేతిలో 11-21, 17-21తో పోటిలో నిష్క్రమించింది.

మహిళల డబుల్స్‌ విభాగం:

సిమ్రాన్ సింఘి – కావిప్రియ సెల్వం జోడీ, దక్షిణ కొరియా జంట బాక్ హా నా – లీ సో హీ చేతిలో 4-21, 9-21తో పరాజయం పాలయ్యారు.

Leave a Reply