Sigachi Blast | ఆ ఎనిమిది మంది భస్మం … ఎముక దొరికినా కర్మ చేస్తామంటున్న బంధువులు


ఆనవాళ్ల కోసం అయినవాళ్ల వేదన కార్మికుల కుటుంబాల్లో విస్పోటనం
ఆచూకీ కోసం అస్థికలే దిక్కు
సిగాచిలో ప్రాంతంలో అణువణువూ గాలింపు
ఎముక దొరికినా చాలంటున్నా బంధువులు
పరిశ్రమ వద్ద రక్త సంబంధీకులు కన్నీటి పర్యంతం
మిస్టరీగా మారిన ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ

  • సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ (central desk )

సిగాచీ పరిశ్రమలో (sigachi pharma ) జ‌రిగిన‌ భీకర విస్పోటనంలో కొంత‌మంది స‌జీవ ద‌హ‌నం (burned ) అయితే ఇంకొంద‌రు ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతూ ఆస్ప‌త్రిలో చికిత్స‌ మ‌రణించారు. మొత్తంగా 44 మంది చ‌నిపోయిన‌ట్టు అధికారులు ధ్రువీక‌రించారు. ప్రమాదం జరిగిన తొలి రోజున 16 మంది చ‌నిపోయిన‌ట్టు ప్ర‌క‌టించిన అధికారులు.. ఆ త‌ర్వాత‌ ఘటన స్థలిలో దొరికిన ఎముకలు, శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు (dna tests) జరిపి.. మృతులను గుర్తించటం ప్రారంభించారు. ఇప్సటికి మృతుల సంఖ్య 44కు చేరింది. ఇంకా మ‌రో 8 మంది ఆచూకీ లేదు. తెలంగాణ బిడ్డ సిల్వేరి రవి, ఏపీ సిక్కోలు బిడ్డ గుండేపల్లి వెంకటేశ్, ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్న క‌ర్నాట‌కు చెందిన కుర్రాడు జస్టిన్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్ శర్మ, అఖిలేశ్ కుమార్ నిషాద్, విజయ్ కుమార్ నిషాద్, బీహార్‌కు చెందిన శివ్‌జీ కుమార్, జార్ఖండ్‌కు చెందిన ఇర్ఫాన్ అన్సారీ ఆచూకీ లేకుండా పోయింది.

అణువణువూ అన్వేషణ..

అదృశ్యమైన (missing ) ఎనిమిది మంది ఆచూకీ కోసం అధికారులు సిగాచి ప్రమాద స్థలిలోని అణువణువూ గాలిస్తున్నారు. తమకు దొరికిన శాంపిళ్లను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలతో సరిపోల్చే ప్రక్రియ సాగుతోంది. కానీ, ఈ 8 మంది ఆచూకీ ఇప్పటి వరకూ తెలియలేదు. అదృశ్య కార్మికుల శరీర భాగాలు లేదా అవశేషాలు లభిస్తాయేమోనని డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బంది ప్రమాద స్థలిలో జల్లెడ పడుతున్నారు. చిన్న ఇనుప కడ్డీలు, కర్రలు పట్టుకుని ప్రమాద ప్రదేశంలో శిథిలాలను తవ్వుతూ ఏదైనా ఎముకలు, కణజాలం దొరుకుతాయేమోనని వెతుకుతున్నారు. అలాగే, సిగాచీ ఇండస్ట్రీ నుంచి తొలగించిన శిథిలాలను సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో పోశారు. అక్కడ కూడా మున్సిపల్, డీఆర్ఎఫ్ సిబ్బంది శోధిస్తున్నారు. ఇప్పటివరకు మృతుల శరీర భాగాల నుంచి శాంపిల్స్ సేకరించి, కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపిల్స్ తో సరిపోతే.. వాటిని అప్పగించి కార్మికుడు మృతి చెందినట్టు జాబితాలో పేరును నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన పరిశ్రమ వద్దకు మీడియాను, ఇతర బయట వ్యక్తులను పోలీసులు అనుమతించడం లేదు.ఈ స్థితిలో ఘటన జరిగి 10 రోజులవడంతో ఆచూకీ లేని 8 మంది కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాశం మైలారం చేరుకున్న కుటుంబ సభ్యులు పడిగాపులు పడుతున్నారు. కనీసం ఈ రోజు జాడ తెలవాలని ముక్కోటి దేవుళ్లను మొక్కుతున్నారు.

తల్లడిల్లుతున్న బంధువులు

బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఇది ఒక రోజు.. అదిగో ఒక రోజు అంటున్నారు. కనీసం ఎముకల్ని ఇచ్చినా దశదిన కార్యం జరుపుతాం, అని శ్రీకాకుళం జిల్లా చెందిన ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెండుసార్లు రక్త నమూనాలు తీసుకున్నారు. శరీరంలో చిన్న ముక్క దొరికినా పంపించి పరీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ నమూనాతో మ్యాచ్ కాకపోవడం మా దురదృష్టం అంటూ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ప్రమాదంలో చిన్నారావు కుమారుడు గుండేపల్లి వెంకటేశ్ ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. సిగాచి ఇండస్ట్రీలో క్వాలిటీ అనాలసిస్ విభాగంలో నాలుగేళ్లుగా సీనియర్ కెమిస్టుగా వెంకటేశ్ పనిచేస్తున్నారు. వెంకటేశ్ తండ్రి, ఇతర బంధువులు పాశం మైలారంలోని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) కార్యాలయం వద్ద కబురు కోసం పడిగాపులు పడుతున్నారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎదురుచూస్తూనే ఉన్నాం. 11వ రోజున కర్మ చేయాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదైనా ఎముక తీసుకెళ్లి చేయాలి.. లేదా పిల్లాడ్ని ఇక్కడ ఒగ్గేసి వెళ్లాలా.. అర్థం కావడం లేదు, అంటూ చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు.

క‌ర్నాట‌క నుంచి వ‌చ్చిన బాధిత కుటుంబం..

క‌ర్నాట‌క‌లోని బీదర్‌కు చెందిన జస్టిన్ (22) పనిలో చేరిన మూడో రోజే ప్రమాదంలో గల్లంతయ్యారు. పాతిక మంది జస్టిన్ కుటుంబ సభ్యులు పాశం మైలారంలో ఎదురు చూస్తున్నారు. జస్టిన్ కుటుంబం హైదరాబాద్ పటాన్‌చెరు ప్రాంతానికి వచ్చి అక్కడే ఉంటోంది. భీంరావు అనే స్నేహితుడి సాయంతో సిగాచీ ఇండస్ట్రీలో ప్రమాదానికి మూడు రోజుల ముందే పనికి కుదిరాడని జస్టిన్ తండ్రి రామదాసు చెప్పారు. ఈ ప్రమాదంలో భీంరావు కూడా చనిపోయాడు. ఇప్పటికి పది రోజులు అయ్యింది. అన్నం లేదు.. నీళ్లు లేవు. నాకున్నది ఒక్క కొడుకు. నేనెట్లా బతకాలి. ఇప్పుడు ఏం చేయాలో, ఎవరూ ఏమీ చెప్పడం లేదు అని రామదాసు కన్నీటి పర్యంతమయ్యారు. ఆఫీసర్లు వచ్చి మరో 24 గంటలు, మరో 24 గంటలు అంటున్నారే కానీ ఏమీ తెలియడం లేదని అన్నారాయన. నాతో సహా అయిదుగురం శాంపిల్స్ ఇచ్చాం. ఇప్పటివరకు లభించిన ఏ శరీర భాగంతోనూ మ్యాచ్ కాలేదని చెబుతున్నారు అని రామదాసు వాపోయారు. జస్టిన్‌కు సంబంధించి ఏదైనా గుర్తు దొరుకుతుందేమోని ఆశగా ఎదురు చూస్తున్నాం. ఆయన శవం దొరకలేదు. చిన్న బట్ట కూడా దొరకలేదు. మొత్తం మా కుటుంబాలన్నీ చిన్న చిన్న పాపలతో వచ్చి ఇక్కడే ఉంటూ ఏదైనా ఆచూకీ దొరుకుతుందేమోని ఎదురు చూస్తున్నాం, అని జస్టిన్ మేనత్త గొల్లు మంటోంది.

ఆధారాల కోసం బ్ల‌డ్ శాంపుల్స్‌..

శాంపిల్స్ తీసుకున్నా.. మ్యాచ్ కాకపోవడంతో రెండు నుంచి మూడుసార్లు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారని ఆచూకీ లేని 8 మంది కుటుంబ సభ్యులు చెబుతున్నారు.యూపీకి చెందిన అఖిలేశ్ కుమార్ నిషాద్, విజయ్ కుమార్ నిషాద్ ఆచూకీ కూడా గత నెల 30వ తేదీన ప్రమాదం జరిగినప్పటి నుంచి కనిపించడం లేదని బంధువులు చెబుతున్నారు. అఖిలేశ్, విజయ్ తల్లిని వెంట పెట్టుకుని వారి బంధువు జైప్రకాష్ నిషాద్ యూపీ నుంచి వచ్చి పాశం మైలారంలోని ఐలా ఆఫీసు వద్ద ఎదురుచూస్తూ కనిపించారు. ఇప్పటివరకు ఏమీ తెలియడం లేదు. అధికారులు వచ్చి డెడ్ బాడీ దొరుకుతుందని చెబుతున్నారు. కానీ, ఇప్పటివరకు అది కూడా దొరకలేదు. ప్రభుత్వం, కంపెనీ ఇచ్చే పరిహారం ఏమో గానీ కనీసం డెడ్‌బాడీ అయినా దొరికితే చాలు అన్నట్లుగా ఉంది అని జై ప్రకాష్ నిషాద్ అన్నారు.

డీఎన్ఏ మ్యాచ్ కావ‌డం లేదు..

కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్స్ తీసుకున్నాం. కానీ, ఇప్పటి వరకు వారి డీఎన్ఏ ప్రమాద స్థలం నుంచి సేకరించిన శాంపిల్స్‌తో మ్యాచ్ కాలేదు. ఇంకా డీఎన్ఏ శాంపిల్స్ మ్యాచింగ్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చివరి నిమిషం వరకు పరీక్షలు కొనసాగిస్తాం, సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి గాయత్రీ దేవి చెప్పారు.

డిసెంబర్‌లోనే అలెర్ట్ చేసినా..

సిగాచి ఇండస్ట్రీలో మొత్తం 197 మంది పనిచేస్తుండగా, 110 మంది రెగ్యులర్, 87 మంది కాంట్రాక్టు కార్మికులున్నట్లు తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ గుర్తించింది. గతేడాది డిసెంబరులో పరిశ్రమలో చేసిన తనిఖీలకు సంబంధించిన నివేదిక తాజాగా వెలుగు చూసింది. అగ్నిప్రమాదాలు జరిగితే బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడం, కార్మికుల భద్రతకు సంబంధించి రక్షణ పరికరాలు పూర్తిస్థాయిలో లేకపోవడం, ప్రాథమిక చికిత్స కిట్లు లేవని, కార్మికులకు రక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ తన నివేదికలో చెప్పారని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు. ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ వెళ్లి లోపాలు ఉన్నాయి. సరిచేసుకోవాలని స్పష్టంగా రిపోర్టు ఇచ్చారని తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి తెలిపారు. టెక్నికల్ అంశాలను సరిచేసుకోవడం మేనేజ్‌మెంట్ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

ఆ ఎనిమిది మంది భస్మం – అధికారికంగా ప్రక‌ట‌న‌

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన రోజు గల్లంతైన 8 మంది కార్మికులు ఇంకా కనిపించకపోవడంతో, ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమే అని అధికారులు తేల్చేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ల బాడీలు పేలుడు సమయంలో తీవ్రంగా కాలిపోయి బూడిదయ్యి ఉంటారని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తుంది. దీని కారణం ఇప్పటివరకు 100కి పైగా శాంపిల్స్‌ను సేకరించి డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించినా ఒకటికీ కూడా తగిన పోలిక లభించలేదు. ఈ నేపథ్యంలో, బాధిత కార్మికుల కుటుంబ సభ్యులను పరిశ్రమ వద్ద నుంచి ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మూడునెలల తర్వాత తిరిగి రావాలని సూశించారు. అప్పటివరకు రాష్ట్ర, కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనలో బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని తమవారిని కోల్పోయిన ప్రజలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply