CT 2025 – PAK vs NZ | ఆతిథ్య జట్టుకు షాక్.. టోర్నీలో న్యూజిలాండ్ శుభారంభం !

క‌రాచీ : ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు షాక్ తగిలింది. కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. 321 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 47.2 ఓవర్లలో 260 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్ జట్టు 60 పరుగుల తేడాతో పాక్ పై విజయం సాధించి ఈ మెగా టోర్నీలో శుభారంభం చేసింది.

కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 320 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ విల్ యంగ్ (107), టామ్ లాథమ్ (118 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్ (61) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాక్ బౌల‌ర్ల‌లో నసీమ్, రాఫ్ ల కు రెండేసి వికెట్లు ల‌భించ‌గా, అర్బ‌ర్ ఆహ్మ‌ద్ ల‌కు ఒక్కొ వికెట్ దక్కింది.

ఇక ఛేజింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు 47.2 కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (64), ఆల్రౌండర్ ఖుష్దిల్ షా (69) అర్థ సెంచరీలతో ఆకట్టుకోగా.. ఆఘా సల్మాన్ (42) మెప్పించాడు. అయితే మిగిలిన బ్యాటర్లు అంతగా రాణించకపోవడంతో పాక్ కు ఓటమి తప్పలేదు.

న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్, విలియం ఓరూర్కే మూడు వికెట్లు పడగొట్టగా.. మాట్ హెన్రీ రెండు వికెట్లు తీశాడు. ఇక మైకేల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.

కాగా, ఈ టోర్నీలో రేపు జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్ – బంగ్లాదేశ్ జట్లు దుబాయి వేదికగా తలపడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *