కార్తీక పూజలతో శైవ క్షేత్రాలు కిటకిట..
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ :
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నల్లగొండ పట్టణంలోని అత్యంత ప్రాశస్త్యం గల ఛాయా సోమేశ్వర దేవాలయం, వాడపల్లి అగస్తేశ్వర స్వామి దేవాలయం, దేవరకొండ పట్టణంలోని పురాతన శివాలయాలు, సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో శివాలయాలకు వచ్చి కార్తీక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు శివాలయాలకు భక్తులు పోటెత్తడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు శివాలయాలలో అభిషేకాలు చేసేందుకు టికెట్ల ధరలను నిర్ణయించి భక్తుల నుండి వసూలు చేసిన ఆలయాల నిర్వాహకులు అందుకు తగ్గ విధంగా భక్తులకు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపించాయి.

