గువ్వలదొడ్డిలో విషాదఛాయలు
- ముందు ప్రియుడు.. ఆ తరువాత ప్రియురాలు…
- గువ్వలదొడ్డిని కమ్ముకున్న విషాద మేఘాలు
- ఆసుపత్రి మంచం పై చివరి ఊపిరి – ప్రేమకథకు ముగింపు
ఎమ్మిగనూరు టౌన్, అక్టోబర్ 11 (ఆంధ్రప్రభ): కర్నూల్ (Kurnool ) జిల్లా, ఎమ్మిగనూరు పరిధిలోని గువ్వలదొడ్డి… ఓ చిన్న పల్లె. ప్రేమ అనే మాటకు కొత్త అర్థం ఇచ్చి, ఆ ప్రేమలోనే ప్రాణాలర్పించిన జంటతో ఇప్పుడు ఆ ఊరు కన్నీటి సంద్రంగా మారింది. ప్రేమలో పడ్డారు ఇద్దరు యువ హృదయాలు.. ధనుంజయ గౌడ్ (Dhananjaya Goud) (27), శశికల. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరింది. కానీ… జీవితమనే నది వారిని విభజించింది. కుటుంబాల ఒత్తిళ్లు, మాటల దెబ్బలు, సామాజిక ముసుగులు – ప్రేమను పిండేయడంతో ధనుంజయ గౌడ్ అక్టోబర్ 6న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆ వార్త శశికల చెవిన పడగానే… ప్రపంచం కూలిపోయింది. ఆమె కళ్లలో కన్నీరు కాదు, ఒక ప్రపంచం పగిలిన ప్రతిధ్వని కనిపించింది. నా ధనుంజయ లేకపోతే నేను ఎందుకు అన్న భావనతో మరుసటి రోజు పురుగుల మందు తాగి ప్రాణాలర్పించింది. తక్షణమే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించినా… ప్రియుడి జ్ఞాపకాలను విడిచిపెట్టలేక శశికల ప్రాణం కూడా శనివారం తెల్లవారుఝామున ఆగిపోయింది.
ఇప్పుడు ఆ ఊరిలో మాట ఒకటే..
ప్రేమలో పడ్డారు… ప్రపంచం అడ్డొచ్చింది… చివరికి ప్రాణాలే ఇచ్చారు. ధనుంజయ–శశికల ప్రేమకథ ఓ మృదువైన గీతలా మొదలై, కన్నీటి చుక్కలతో ముగిసింది. వారి జ్ఞాపకాలు మాత్రం గువ్వలదొడ్డి గాలుల్లో ఇంకా తేలుతున్నాయి.