- వంకలు పరవళ్లు
- రాదారులు బంద్
- మహానందిలో భయం భయం
- నట్టింటిలో వరదమ్మ చిందులు
- ఇదీ నంద్యాల జిల్లా స్థితి గతి
(నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ) : నంద్యాల జిల్లా (Nandyal District) వ్యాప్తంగా శుక్ర శనివారాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నంద్యాల జిల్లాలోని మహానంది, ఉయ్యాలవాడ, పాణ్యం మండలాల్లో కుండ పోతగా వర్షం కురిసింది. జన జీవనం స్థంభించింది. శనివారం ఉదయం ఉయ్యాలవాడ మండలంలోని రూపనుగుడి గ్రామం వద్ద వరద నీటిలో ఒక ట్రావెల్ బస్సు (Travel bus) చిక్కుకుంది. 24మంది చిన్నారులు, వృద్ధులు మహిళలు అందరినీ అధికారులు సురక్షితంగా గట్టుకు చేర్చారు. మహానంది మండలంలోని పాలేరు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిచిపోయాయి. మహానందిలోని దేవస్థానం కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.
కాలనీకి చెందిన సుబ్బమ్మ ఇంట్లోకి నీరు చేరింది. ఇళ్లలోని వస్తువులు ధాన్యం తడిచిపోయాయి. జనానికి తీవ్ర నష్టం వాటిల్లింది. రాబోయే రాత్రులు కూడా నిద్ర లేకుండా గడపాల్సిన సమయం వచ్చిందని ఆమె వాపోతోంది. స్థానిక అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పి జి కళాశాల (Ramakrishna PG College) సమీపంలోని శ్యామ్ కాలువలో పెద్ద మొత్తంలో వరద నీరు ప్రవహిస్తోంది. శని వారం 2.30 నిమిషాలకు వరదనీరు బ్రిడ్జి నీ తాకింది… ఇదే ఉదృతి కొనసాగితే గంట లోపల వరద నీరు బ్రిడ్జి పైకి చేరి రాకపోకలను నిలిపి వేసే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలువ ప్రక్కన ఉన్న హౌసింగ్ బోర్డ్ వాసులకు వరద ముప్పు తో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కిందట ఇలాగే వరద వచ్చినప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ (Housing Board Colony) సగం మునిగిపోయింది. ఈ వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు అధికంగా రావడంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడుకు ఎస్సార్ బీసీకి తెలుగు గంగకు పాలేరు కాలువకు నీరు వదలడంతో వరద ఉధృతి పెరిగింది. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లోని హోండా షోరూం వద్ద ఇళ్లలోకి నీరు చేరుకుంటున్నాయి.