తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..

తమిళనాడులోని తిరుచిరాపల్లి (ట్రిచీ) జిల్లాలో బుధవారం రాత్రి అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచిరాపల్లి నుంచి చెన్నై వైపు వెళ్తున్న బస్సు అదుపుతప్పడంతో ఈ ఘోర దుర్ఘటన సంభవించింది.
తిరుచిరాపల్లి – చెన్నై జాతీయ రహదారిపై బస్సు వెళ్తుండగా, ఒక్కసారిగా ముందు వైపు టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు డివైడర్‌ను ఎక్కి అవతలి వైపు నుండి వస్తున్న రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. బస్సులోని పలువురు ప్రయాణికులు, కార్లలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తొంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తొంది.
