4 మండలాల్లో సజావుగా రెండో విడత ఎన్నికలు

  • బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి
  • జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జనగామ, ఆంధ్రప్రభ : జనగామ జిల్లాలోని నాలుగు మండలాల్లో రెండో విడత ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. శనివారం ఆయన వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించారు.

ఆదివారం జరగనున్న రెండో విడత ఎన్నికల నేపథ్యంలో జనగామ, బచ్చన్నపేట, నర్మేట్ట, తరిగొప్పుల మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఆయన పరిశీలించారు. తాగునీటి వసతి, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు తదితర ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీఓలు, ఓపీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాయా లేదా అన్నదానిపై కలెక్టర్ ఆరా తీశారు.

ఎలాంటి లోటుపాట్లు, గందరగోళాలకు తావులేకుండా ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని సూచించారు. చెక్‌లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని వస్తువులు అందాయా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని తెలిపారు. సిబ్బంది సకాలంలో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పోలింగ్ సామగ్రి, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల తరలింపు సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసు బందోబస్తు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆర్ఓలు, మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏసీపీ పండరి నితిన్ చేతన్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సామగ్రిని స్వీకరించిన సిబ్బంది బస్సుల ద్వారా తమ తమ గ్రామాలకు తరలివెళ్లారు.

Leave a Reply