Scrub typhus | రాకూడదంటే ఏం చేయాలి..
- స్క్రబ్ టైఫస్ కేసుల పట్ల ఆందోళన వద్దు..
- సమాయానికి గురిస్తే నమవుతుంది..
- మూడు నెలల్లో జిల్లాలో 6 పాజిటివ్ కేసులు..
Scrub typhus, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇటీవల కాలంలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా (krishna district) వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, స్క్రబ్ టైఫస్ ముందస్తుగా గుర్తించి సమయానికి యాంటీబయాటిక్ చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా నయం అవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి.యుగంధర్ మంగళవారం తెలిపారు. కృష్ణా జిల్లాలో అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇవి కూడా ప్రధానంగా వ్యవసాయ పనులు చేసే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరంతో వచ్చే కేసుల్లో స్క్రబ్ టైఫస్ గుర్తించబడుతుందని తెలిపారు. జిల్లా స్థాయి నిఘా ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులు, సిహెచ్సి, పిహెచ్సిలు నుండి అందుతున్న నివేదికల ఆధారంగా అనుమానిత, ధృవీకరిత కేసుల పై ప్రత్యేక మానిటరింగ్ కొనసాగుతుందన్నారు.
Scrub typhus | నివారణ చర్యలు ఇవే
ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్యఆరోగ్యశఖ అధికారి పి.యుగంధర్ తెలిపారు. పంట పొలాలు, గడ్డి, పొదలు ఉన్న ప్రదేశాల్లో పని చేసే సమయంలో పూర్తిగా చేతులు కప్పేలా ఉన్న చొక్కా పూర్తిగా కాలును కప్పేలా ఉన్న ప్యాంటు, బూట్లు వంటి రక్షణ దుస్తులు ధరించాలని తెలిపారు. దోమలు, పురుగుల కాటు నివారణకు మశక నిరోధక లోషన్లు, క్రీములు, స్ప్రేలు వాడాలన్నారు. పొదలు, చెత్త, గడ్డి దగ్గర లేదా బయట పందిరి మీద, నేలపై బోర్లా నిద్రించకుండా ఉండాలని, రాత్రి సమయంలో తప్పనిసరిగా మస్కిట్ నెట్ ఉపయోగించాలన్నారు.
Scrub typhus | దద్దుర్లు లేదా చర్మం పై నల్లటి పూత
3 రోజులకు మించి జ్వరం కొనసాగితే, ముఖ్యంగా దద్దుర్లు లేదా చర్మం పై నల్లటి పూత (ఎస్కార్) కనిపిస్తే, స్వయంగా మందులు తీసుకోకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే వెళ్లాలన్నారు. గర్బిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న పిహెచ్సి, సిజిహెచ్ లేదా ఆసుపత్రిల్లో వైద్యులను సంప్రదించాలని కోరారు. స్క్రబ్ టైఫస్ ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నివారించవచ్చునని తెలిపారు. కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి పై సూచనలు పాటించి, జ్వరం వచ్చినప్పుడు వెంటనే ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయించాలని యుగంధర్ మార్గదర్శకాలు జారీ తెలియజేశారు.


