School | చిన్నారికి తీవ్రంగా గాయాలు

School | చిన్నారికి తీవ్రంగా గాయాలు

School | కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూల్ నగరంలోని బండిమెట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మంటల ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పాఠశాల ప్రాంగణంలో విరామ సమయంలో కొంతమంది విద్యార్థులు మంటలతో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వివరాల ప్రకారం, విద్యార్థులు నిర్లక్ష్యంగా వెలిగించిన మంటలు ఒక్కసారిగా అదుపు తప్పి సమీపంలో ఉన్న విద్యార్థినిపై పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో చిన్నారి శరీరంలోని కొన్ని భాగాలు తీవ్రంగా కాలిపోయాయి.

ఘటనను గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో తగిన భద్రతా చర్యలు లేకపోవడమే ప్రమాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో మంటలు వెలిగించడానికి ఎలా అనుమతి లభించిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

School |

ఇదిలా ఉండగా, రాష్ట్ర నాయకుడు రమణా ఈ ఘటనపై స్పందిస్తూ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల హెడ్మాస్టర్‌ను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థుల భద్రతపై పాఠశాలలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

School |

Leave a Reply