Kidnapping | సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ కలకలం!

Kidnapping | సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ కలకలం!
- ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు
- డ్రామా అని సోషల్ మీడియాలో ప్రచారం
Kidnapping | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి, బీఆర్ఎస్ మద్దతుదారి మామిడి నాగమ్మ భర్త యాదిగిరి కిడ్నాప్ కలకలం సృష్టించింది. తన భర్త మామిడి యాదగిరిని కాంగ్రెస్ పార్టీకి చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ నాగమ్మ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు ఆమెచేత శనివారం రాత్రి ఫిర్యాదు ఇప్పించారు. యాదగిరిని తిప్పర్తి పోలీసులు అదుపులోకి తీసుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాంగ్రెస్ నేత సందీప్ రెడ్డి అనుచరులు తనను కిడ్నాప్ చేసి హైదరాబాదుకు తీసుకెళ్లారని దారి మధ్యలో తీవ్రంగా కొట్టడమే కాకుండా మూత్రం తాగించారని యాదిగిరి చెప్పారు.
డ్రామా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం…
కిడ్నాప్ డ్రామా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాను ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేసుకునేందుకు హైదరాబాదుకు వచ్చానని యాదగిరి తన భార్య నాగమ్మకు ఫోన్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. నామినేషన్ వేయొద్దని ఆయన భార్య నాగమ్మకు చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
