Sarapaka | సన్నబియ్యం అన్నం రుచిచూసిన సీఎం – లబ్ధిదారుడి ఇంట లంచ్

ఉమ్మడి ఖమ్మం, ఆంధ్రప్రభ :సన్న బియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏదో ఒకరోజు లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక కు చేరుకున్నారు. అక్కడి సన్న బియ్యం లబ్ధిదారుడు శ్రీను ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.
అదేవిధగా సీఎం వెంట వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రుల తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు కూడా అక్కడే సన్న బియ్యం అన్నం ఆరగించారు.
