హైదరాబాద్, జులై 7 (ఆంధ్రప్రభ ) : ప్రముఖ సాహితీవేత్త, ప్రాణహిత కవి, సంప్రదాయ ఆధునిక విప్లవ అభ్యుదయ దిగంబర కవులెందరికో అత్యంత ఆప్తుడు, రాజమహేంద్రవరం (Rajahmundry) గౌతమీ గ్రంధాలయ పూర్వ ఉన్నతోద్యోగి సన్నిధానం నరసింహ శర్మకు తన సతీమణి, ఎందరికో ఆత్మబంధువై ఆదరించిన మాతృమూర్తి సన్నిధానం శతకీర్తి (SANNIDHANAM SATHAKEERTHI ) ( 70) హైదరాబాద్ నిజాంపేటలోని కుమారుని ఇంట గాఢమైన నిద్రలోనే మృతి చెందారు. శరాఘాతంలాంటి ఈ వార్త తెలిసిన వెంటనే ప్రఖ్యాత జానపద పరిశోధకులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు జయధీర్ తిరుమల రావు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కవి సతీష్ చందర్, హాస్యబ్రహ్మ శంకర నారాయణ, ఎడిటోరియల్ డెస్క్ సీనియర్ జర్నలిస్ట్ జాస్తి విష్ణు, ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ (PURANAPANDA SRINIVAS) తదితర ప్రముఖులు సన్నిధానం శర్మను పరామర్శించి ధైర్యం చెప్పారు.
దశాబ్దాల నాడు సన్నిధానం శర్మ గృహానికి ప్రఖ్యాత కవులు ఆరుద్ర, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, మల్లంపల్లి శరభయ్య, ఆవంత్స సోమసుందర్, వెలుతురు పిట్టల కవి క్రొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, చలసాని ప్రసాద్, వెల్చేరు నారాయణరావు, అద్దేపల్లి రామమోహన్ రావు వంటి ఉద్దండులైన కవి ప్రముఖులు, విమర్శకులు, సాహితీవేత్తలు విచ్చేసిన క్రమంలో సన్నిధానం శతకీర్తి చేసిన ఆతిధేయ వినయపూర్వక సేవలకు ఆశ్చర్యం చెంది ఉత్తమ సౌశీల్యవతియైన శతకీర్తిని ఆరోజుల్లోనే ఆశీర్వదించడాన్ని ఈనాటికీ చెప్పుకుంటున్నారంటే ఆమె వినయసంపత్తి, అన్నపూర్ణమ్మ తల్లిలాంటి ఆదరణే కారణమని రసజ్ఞులు, సాహితీ ప్రముఖులు ప్రశంసిస్తున్న అంశాన్ని పేర్కొనక తప్పదు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ సైతం శతకీర్తి సంస్కారప్రదమైన అంశాల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ సన్నిధానం శర్మ కుమారులు సన్నిధానం వంశీకృష్ణ, సన్నిధానం రవితేజలను కలిసి ఆమెకు ఘన నివాళులర్పించారు.
హైదరాబాద్ నిజాంపేట మహాప్రస్థానంలో శతకీర్తికి దహనసంస్కారాది అంత్యక్రియల ఘట్టాలు కుమారులు నిర్వహించారు. సుమారు నాలుగు దశాబ్దాల పైచిలుకు తన వదిన శతకీర్తి తనను కన్న బిడ్డలా చూసుకుందని, ఆమె మరణం తీవ్రంగా కలచివేసిందని సన్నిధానం శర్మ సోదరుడు, సీనియర్ పాత్రికేయులు సన్నిధానం శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర సాహిత్య అకాడెమీ గ్రహీత, ప్రఖ్యాత కవి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, సీనియర్ జర్నలిస్ట్ వి.ఎస్.ఎస్.కృష్ణకుమార్, రవిప్రకాష్ తదితరులు సన్నిధానం శర్మకు తమ సంతాపం వ్యక్తం చేశారు.