Sankranti celebrations | తెలుగు జాతి సంస్కృతికి ప్రతీక సంక్రాంతి

Sankranti celebrations | తెలుగు జాతి సంస్కృతికి ప్రతీక సంక్రాంతి
- ఎంపీ కేశినేని శివనాథ్
Sankranti celebrations | విజయవాడ, ఆంధ్రప్రభ : తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీకగా నిలుస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పంటల పండుగగా, కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే పండుగగా సంక్రాంతికి విశిష్ట స్థానం ఉందన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ 316డి డిస్ట్రిక్ట్ మహానగర్ ఆధ్వర్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సంక్రాంతి సంబరాలు ఆదివారం ఘనంగా జరిగాయి.

తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, చిలక జ్యోతిష్యం వంటివి పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ పండుగ శోభను తిలకించారు.

అలాగే చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, తెలుగు వారి పెద్ద పండుగైన సంక్రాంతిని ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తారని, ఇటీవల విజయవాడ ఉత్సవ్, ‘అమరావతి ఆవకాయ్’ కార్యక్రమం సాధించిన విజయమే నిదర్శనమని పేర్కొన్నారు.

రాష్ట్ర సమగ్రాభివృద్దితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ప్రాంతంలో కళలు, సాహిత్యం ప్రోత్సహించే విధంగా టూరిజం పెంపొందించటానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఉత్సవాలు, సంబరాలు ఇంకా జరగాలని ఆకాంక్షిస్తూ టూరిజం అభివృద్ది చెందితే మనీ సర్య్యూలేషన్ జరుగుతుందన్నారు.
విశాఖపట్నంలో త్వరలో ఉత్సవాలను నిర్వహించబోతున్నామని, అదేవిధంగా కొండపల్లి, పున్నమి ఘాట్, కనకదుర్గమ్మ ఆలయం, వేదాద్రి వంటి ప్రాంతాలను కలిపి విజయవాడను ఒక ప్రముఖ టూరిజం సర్క్యూట్‌గా పర్యాటక శాఖ తీర్చిదిద్దాలని ఎంపీ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ అంటేనే పంటలు ఇంటికి వచ్చే శుభసమయమని, లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
