ఇక పారిశుద్ధ్యం… తాగునీరు ముఖ్యం

ఇక పారిశుద్ధ్యం… తాగునీరు ముఖ్యం

  • పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : మొంథా తుపాను కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, పశు నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం పై కలెక్టర్ బుధవారం రాత్రి మాట్లాడారు. తుఫాను, భారీ వర్షాల కారణంగా జిల్లాలో భీమవరం మండలం తోకతిప్ప గ్రామంలో రోడ్లు రెండు అడుగుల మేర, నరసాపురం మండలం బియ్యపు తిప్ప గ్రామంలో రోడ్లపై ఒక అడుగు మేర వర్షపు నీరు నిలిచిందన్నారు.

నీరు తొలగింపు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 93 ఇళ్ళు, 174 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో బలమైన ఈదురు గాలులు కారణంగా 662 చెట్లు నేల కొరిగాయాన్నారు. రోడ్లపై విరిగిపడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనులలో విద్యుత్ శాఖ సిబ్బంది నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

జిల్లాలోని మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రోజువారీ నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఐదు రోజులపాటు వేటను కోల్పోయినందున ప్రభుత్వం నిర్ణయం మేరకు మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలన్నారు.

ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం,1కిలో కంది పప్పు, 1లీటరు వంట నూనె, 1కిలో ఉల్లిపాయలు, 1కిలో బంగాళాదుంపలు, 1కిలో చక్కెర అందజేయాలని తెలిపారు. అదేవిధంగా తుఫాను నష్ట గణన ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు.

ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడానికి వినియోగించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. త్రాగునీటిని క్లోరినేషన్ చేసిన తర్వాతనే విడుదల చేయాలన్నారు.

Leave a Reply