సాయి కృప ఆసుపత్రి సీజ్ చేసిన కలెక్టర్ బాదావత్ సంతోష్

సాయి కృప ఆసుపత్రి సీజ్ చేసిన కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ల పై ప్రత్యేక నిఘా పెట్టాలని, ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు లేదా అక్రమ అబార్షన్లు నిర్వహించినట్లు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, కమిటీ సభ్యులు ఐ.ఎం.ఏ డిస్టిక్ ప్రెసిడెంట్ డాక్టర్ చెన్నయ్య, డి ఎం హెచ్ ఓ డాక్టర్ రవి నాయక్, అధికారులు పాల్గొన్నారు.
కొల్లాపూర్ పట్టణంలో ఉన్న సాయికృప ప్రైవేట్ ఆస్పత్రిలో ఇటీవల ఒక బాలికకు అక్రమంగా అబార్షన్ నిర్వహించారనే ఆరోపణలపై కమిటీ చర్చించింది.ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆసుపత్రిని సందర్శించి సమర్పించిన నివేదికలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కమిటీ నిర్ణయం మేరకు సాయికృప ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో ఎక్కడైనా ప్రైవేట్ ఆస్పత్రుల్లో స్కానింగ్ సెంటర్ల ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు లేదా అక్రమ అబార్షన్లు నిర్వహించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ఉన్న 38 స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రైవేట్ ఆస్పత్రులపై తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ….జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్ లో పొందుపరిచిన నిబంధన మేరకు ఆసుపత్రులు కొనసాగుతున్నాయా లేదా అన్న అంశంపై వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ జరపాలని కోరారు. స్కానింగ్ సెంటర్ల పై పటిష్ట నిఘా పెట్టాలని, ఇబ్బందులు ఉంటే పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్ చట్టం, 2010 ప్రకారం, ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు , నర్సింగ్ హోమ్‌ల నిర్వహణ తదితర అంశాలపైనా దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ లక్ష్మణ్, డిప్యూటీ డిమో రాజగోపాల్ చారి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
