Rs65cr | ఇఫ్తార్ విందు సరే.. ముస్లింలకు తోఫా ఎక్కడ?.

Rs65cr | ఇఫ్తార్ విందు సరే.. ముస్లింలకు తోఫా ఎక్కడ?.

12 లక్షల కుటుంబాలకు రూ.65 కోట్లు కేటాయించలేరా..
ప్రశ్నించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి

Rs65cr | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రంజాన్ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు అందించే రంజాన్ తోఫా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇఫ్తార్ విందులు నిర్వహిస్తున్నప్పటికీ పేద ముస్లింలకు హామీ ఇచ్చిన తోఫాను ఇప్పటికీ అమలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న తోఫా పేరుతో పేద ముస్లిం కుటుంబాలకు సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

అయితే రెండేళ్లు గడిచినా ఆ హామీ అమలులోకి రాకపోవడం మైనారిటీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 12 లక్షల పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయని, వారికి రంజాన్ తోఫా అందించడానికి కేవలం రూ.65 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. మూడు లక్షల కోట్లకు పైగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో ఈ మొత్తం కేటాయించడం ప్రభుత్వానికి భారమా అని ప్రశ్నించారు. గతంలో ఇదే పథకం అమలు కాలేదని ముస్లింలు ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు అదే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికీ ఎదురవుతుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చెబుతున్న మైనారిటీ సంక్షేమం కేవలం మాటలకే పరిమితమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాల ప్రభావంతో మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. మైనారిటీల అభివృద్ధిపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వెంటనే రంజాన్ తోఫా పథకాన్ని అమలు చేసి పేద ముస్లిం కుటుంబాలకు సహాయం అందించాలని షర్మిల డిమాండ్ చేశారు. రంజాన్ వంటి పవిత్ర సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply