డీఆర్ఐ దాడులతో ఉలికిపాటు…

డీఆర్ఐ దాడులతో ఉలికిపాటు…

  • కొండపల్లి పారిశ్రామికవాడలో సంచలనం
  • 15 సంవత్సరాల నుంచి రేస్ ఆర్గానిక్స్ పేరిట అక్రమ మాదకద్రవ్య ఔషధాల తయారీ
  • విస్తుపోయిన అధికారులు
  • బోర్డులు లేకుండా చీకటి వ్యాపాలు చేస్తున్న కంపెనీలు మరికొన్ని..
  • అక్రమార్కుల భరతం పడితేనే నివారణ

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పారిశ్రామికవాడలో అక్రమ మాదకద్రవ్య ఔషధ తయారీ కంపెనీపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) నిర్వహించిన ఆకస్మిక దాడులు ఉలికిపాటుకు గురి చేశాయి. దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 15 సంవత్సరాల నుంచి రేస్ ఆర్గానిక్స్ పేరిట కంపెనీకి బోర్డు లేకుండా రహస్యంగా మాదక ఔషధ తయారీ జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గోప్య సమాచారంతో గుర్తించారు.

అనంతరం జరిపిన దాడుల్లో భారీ పరిమాణంలో రసాయనాలు బయటపడటం కలకలం రేపుతోంది. దాడుల్లో సుమారు 200 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకోగా, అంతర్జాతీయ మార్కెట్ లో ఈ మాదక పదార్ధం విలువ సుమారు రూ.47 కోట్లు కలిగి ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ చీకటి వ్యాపారం తీగను కేంద్ర దర్యాప్తు సంస్థ డీఆర్ఐ కదిలించింది.

క‌దలనున్న డొంక…

ఇక్కడ తయారైన డ్రగ్ ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే ముఠా ఉండే అవకాశాలపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భారీ నెట్ వర్క్ పనిచేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో కొండపల్లి పారిశ్రామికవాడలో అక్రమ రసాయన తయారీ కేంద్రాలపై నిఘా ఉంచినట్లు సమాచారం. ఈ కేసులో తీగ లాగిన అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేయడం ద్వారా డొంక మొత్తం కదిలించే అవకాశం ఉంది.

పారిశ్రామికవాడపై కొరవడిన నిఘా…

కొండపల్లి పారిశ్రామికవాడపై రాష్ట్ర దర్యాప్తు సంస్థల నిఘా కొరవడింది. ప్రత్యేక రాజ్యంగా కొనసాగుతున్న ఈ పారిశ్రామికవాడలో అసలు ఏం జరుగుతుంది? అంటే ఎవరూ సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికారుల తనిఖీలు లేకపోవడంతో పరిశ్రమల యజమానులు చీకటి వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 30 నుంచి 40 కంపెనీలు ఎలాంటి బోర్డులు లేకుండా పనిచేస్తున్నాయి.

ఆయా కంపెనీల్లో పనిచేసే కార్మికులకు తప్ప ఏం ఉత్పత్తి అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పనిచేసే కార్మికులు ఎవరైనా బయటకు చెబితే అంతు చూస్తామని యజమానులు బెదిరిస్తుంటారని చెబుతున్నారు. దీంతో గుట్టుగా అక్రమ ఉత్పత్తులు చేస్తుంటారని సమాచారం. రేస్ ఆర్గానిక్స్ పేరిట నిర్వహిస్తున్న కంపెనీలో అక్రమ మాదకద్రవ్య ఔషధ తయారీ ఈ కోవకు చెందినదే! ఈ విధంగా బయట ఒక బోర్డు చూపించి లోపల మరో ఉత్పత్తి చేసే కంపెనీలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. పారిశ్రామికవాడలో అక్రమాలకు కొదువ లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గట్టి నిఘా ఉంచి అక్రమార్కుల భరతం పట్టాల్సిన అవసరం ఉంది.

Leave a Reply