ప్రజా వంచన బడ్జెట్ తెచ్చారు..

ప్రజా వంచన బడ్జెట్ తెచ్చారు..

  • మరోసారి అందరినీ మోసం చేశారు..
  • రైతు భరోసా ఎగ్గొట్టినట్టేనా..?-
  • ఆరు గ్యారెంటీలకు పాడె కట్టారు..
  • అప్పుల భారం మోపేందుకు సిద్దం
  • రాష్ట్ర బడ్జెట్పై కేంద్ర మంత్రి బండి ఫైర్

కరీంనగర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచనకు గురి చేసేలా బడ్జెట్ను రూపొందించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. శుక్రవారం కరీంనగర్లో రాష్ట్ర బడ్జెట్పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసం.. దగా.. చేసేలా, ప్రజలను వంచనకు గురి చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. అంకెల ఆర్భాటాలు.. కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ప్రజలకు ఒరిగేందేమీ లేదన్నారు. ఆదాయాన్ని విస్మరించి.. అప్పుల కోసం అర్రులు చాచేలా బడ్జెట్ ఉందన్నారు. మరో రూ.లక్ష కోట్లు అదనంగా అప్పు భారం మోపేందుకు సిద్ధమవ్వడం సిగ్గు చేటన్నారు.

రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడంలో బడ్జెట్ల హ్యాట్రిక్ కొట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేంద్రంపై ఆధారపడటం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మరోసారి రైతు భరోసా పైసలు రెండు విడతలు ఎగ్గొట్టినట్లేనా..? అని ప్రశ్నించారు. రూపాయ కూడా ఇవ్వకుండా కౌలు రైతులు, వ్యవసాయ కూలీల నోట్లో మళ్లీ మట్టి కొట్టారన్నారు. మహిళలను మళ్లీ వంచించారని, తులం బంగారం లేదని, రూ.2500లు రావన్నారు.

అవ్వతాతల నోట్లో కూడా మట్టి కొట్టారని, ఈసారి కూడా రూ.4 వేల పెన్షన్ పెంపు ఊసే లేదన్నారు. నిరుద్యోగులున్నారనే సోయే ఈ ప్రభుత్వానికి లేదని, బడ్జెట్లో నిరుద్యోగ భ్రుతి అంశమే లేదన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు కదా.. రూపాయి బిళ్ల కేటాయించలేదన్నారు. 6 గ్యారంటీలకు ఈ బడ్జెట్తో పాడె కట్టారని, ఆరోగ్యశ్రీకి బడ్జెట్ కేటాయింపుల కంటే గత బకాయిలే ఎక్కువగా ఉన్నాయన్నారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయించాలని విద్యాశాఖ కమిషన్ ప్రతిపాదిస్తే.. 8 శాతానికే పరిమితం చె శారన్నారు.

దేవాదాయ శాఖకు గత బడ్జెట్ లో రూ.190 కోట్లు కేటాయిస్తే… ఈసారి కేటాయింపుల ప్రస్తావనే లేదన్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కంటి తుడుపు కె టాయింపులు చేశారన్నారు. 56 శాతం బీసీ జనాభాకు 4 శాతం కేటాయింపులా..? ఎస్సీ, ఎస్టీలకు సైతం బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేశారన్నారు. మైనారిటీలకు గతేడాదికంటే ఎక్కువ నిధులు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టబడులు తెచ్చామని ఆర్థిక మంత్రి చెప్పడం సిగ్గు చేటన్నారు.

దావోస్, గ్లోబుల్ సమ్మిట్ పేరుతో వచ్చిన పెట్టుబడుల వివరాలు వెల్లడించే దమ్ముందా..? అని ప్రశ్నించారు. రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా..? అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసేందుకు సిద్ధమయ్యాడని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే గత బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ చేసిన అప్పుల భాగోతంపై విచారణ చేపడతామని కేంద్ర మంత్రి బండి స్పష్టం చేశారు.

Leave a Reply