ఎన్‌హెచ్-44 పై ఘోర రోడ్డు ప్రమాదం

ఎన్‌హెచ్-44 పై ఘోర రోడ్డు ప్రమాదం

ఎల్ఐసీ ఏజెంట్ మృతి

కర్నూలు బ్యూరో,ఆంధ్రప్రభ : ఎన్‌హెచ్-44 జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన షేక్ తపాలా ఖాసిం భాష (45) మృతి చెందారు. మృతుడు ఎల్ఐసీ ఏజెంట్‌గా బనగానపల్లెలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు సంతానం ఉండగా, ఇద్దరూ కర్నూలు పట్టణంలోని మాంటిస్సోరి ఇండస్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు.


శుక్రవారం తన కుమారుడి ఆరోగ్యం బాగాలేదని సమాచారం అందడంతో, స్కూటీ (నంబర్: ఏపీ 39 ఆర్ డబ్ల్యు-6964)పై బనగానపల్లె నుంచి కర్నూలుకు వచ్చి పిల్లలను పాఠశాలలో చూసుకున్నారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎన్‌హెచ్-44 రహదారిలోని కృష్ణానగర్ ఫ్లైఓవర్ వద్ద సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో, ఏపీ 29 టీబీ -4399 నంబర్ గల లారీని డ్రైవర్ చిన్న నరసయ్య అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు.


ఈ ప్రమాదంలో తలకు, శరీరంలోని కుడి వైపుకు తీవ్ర గాయాలు కావడంతో ఖాసిం భాష అక్కడికక్కడే అపస్మారక స్థితిలో పడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. అయితే క్యాజువాలిటీ వార్డులో వైద్యులు పరీక్షించి సాయంత్రం 6:08 గంటలకు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య షేక్ రిజ్వానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply