RIP | ఆల్ రౌండ్ అధినేత్రి, మహానటి కృష్ఱవేణి ఇక లేరు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ:రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీత.. తొలి తెలుగు మహిళా సినీ నిర్మాత, వెండితెర నటి, స్వీయ గాయనీ, కృష్ణవేణి (102) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం 3.00 గంటలకు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణవేణికి సినీ పరిశ్రమ అంతిమ వీడ్కోలు పలికింది.
తెలుగు సినీ రంగంలో తొలి మహిళా నిర్మాతగా కృష్ణవేణి పేరు సంపాదించారు. ఎందరో మహా మహ నటులను, గాయకులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. 1993లో చెన్నైకి..పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో డాక్టర్ యర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాణి దంపతులకు 1924, డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ఆ తరువాత రాజమండ్రికి ఈ కుటుంబం చేరుకుంది. రంగస్థలంపై సహజ నటిగా ఎదిగారు.
మహిళల అంతర్గత శక్తిని వెలికి తీసే లక్ష్యంతో తండ్రి డాక్టర్ లక్ష్మణరావు తన కుమార్తెను రంగస్థలంపై రాణించేందుకు అంగీకరించారు. అంతే కృష్ణవేణి ప్రతిభకు చెన్నై సినీ పరిశ్రమ దిగొచ్చింది. ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి. 1939లో కృష్ణవేణి తన మకాంను చెన్నైకి మార్చారు. 1940లో మీర్జాపురం జమీందార్ మేకరంగయ్యతో ఆమెకు వివాహం జరిగింది. 1942లో కృష్ణవేణికి రాజ్యలక్ష్మీ అనూరాధ జన్మించారు. తెలుగులో తొలిసారిగా భారీ పారితోషికం అందుకున్నా నటిగా ఆమెకు పేరుంది.
పదేళ్ల ప్రాయంలో అనసూయ చిత్రంలో కృష్ణవేణి టైటిల్ రోల్ పోషించారు. బాలనటిగా ‘తుకారాం’ చిత్రంలో ఆమె నటించారు. 1938లో ‘కచదేవయాని’ చిత్రంలో నాయికగా అలరించారు. సుమారు ఇరవై చిత్రాల్లో కృష్ణవేణి నటించారు.
సినీ పరిశ్రమలోనే.. ఆల్ రౌండ్ అధినేత్రి కృష్ణవేణి
వెండితెరకు ఆరంగ్రేటం ముందు రంగస్థల నటిగా రాణించారు. 1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత హీరోయిన్ గా తెలుగులో 15 చిత్రాలలో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలోనూ కథానాయకిగా నటించింది. తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపద గీతాలకు పెద్దపీట వేశారు.
ఇక సినీ నిర్మాతగా మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకువచ్చారు. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయిగా చరిత్ర సృష్టించిన మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును, నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేశారు.
ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేశారు. గాయనీమణులు పి. లీల, జిక్కీలను కృష్ణవేణినే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. త్రిపురనేని గోపీచంద్‌ను కూడా సినీ రచయితగా కృష్ణవేణి మార్చారు.
భర్త మేకా రంగయ్య స్థాపించిన – జయా పిక్చర్స్ నుంచి సినీ నిర్మాతగా మారారు. ఆ తరువాతి కాలంలో ఈ నిర్మాణ సంస్థకు శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు. – తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్ ను ప్రారంభించారు. 1947లో రిలీజైన గొల్లభామతో గుర్తింపు..1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది.తన పాటలను తానే పాడుకున్న నట గాయనిగా కూడా ఆమె పేరు సంపాదించారు.
వివాహానంతరం ‘భోజ కాళిదాసు’లో కృష్ణవేణి నటించారు. 1947లో విడుదలైన ‘గొల్లభామ’తో గుర్తింపు తెచ్చుకున్నారు. తల్లి కృష్ణవేణి బాటలో నిర్మాతగా అనూరాధాదేవి రాణించారు. కీలుగుర్రం సినిమాలో అంజలీదేవికి కృష్ణవేణి నేపథ్యగానం అందించారు. 1952లో వచ్చిన ‘సాహసం’ సినిమాలో ఆమె చివరిగా నటించారు. 1957లో చివరిగా దాంపత్యం చిత్రం నిర్మించారు. కృష్ణవేణి రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. ఇటీవల మనదేశం వజ్రోత్సవ వేడుకలో కృష్ణవేణి పాల్గొన్నారు.