Busy Schedule | హస్తినలో రేవంత్ బిజీ బిజీ… రాహుల్ గాంధీతో భేటి
డిల్లీ పెద్దలతో వరుస భేటీలు కొత్త ఇన్‌చార్జి మీనాక్షికి శుభాకాంక్షలు
కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్టానంతో చర్చలు
తెలంగాణలో భారీ బహిరంగ సభలు
రాహుల్, ప్రియాంకగాంధీకి ఆహ్వానాలు
న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఏఐసీసీ పిలుపుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం పార్టీ పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ పర్యనటలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేతలు కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు పార్టీ పెద్దలను కలవనున్నారు. ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, కొద్దిసేపటిక్రితం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ భేటి అయ్యారు.. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు.
కేబినెట్ విస్తరణపై వివరణ..
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేలా త్వరలో రూపొందించనున్న చట్టం గురించి సీఎం రేవంత్ పార్టీ హైకమాండ్‌కు నివేదించే అవకాశం ఉంది. కుల గణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేయించనున్న విషయం తెలపనున్నారు. వీటితో పాటు పీసీసీ కార్యవర్గ విస్తరణ, కేబినెట్ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఇతర అంశాలపై కూడా చర్చించే చాన్స్ ఉంది. అలాగే.. కొత్తగా నియమితులైన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.
సభలకు రావాలి.. రాహుల్, ప్రియాంకకు ఆహ్వానం
ఇక, నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ రెడీ చేయడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే చాన్స్ ఉంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన సందర్భంగా రెండు భారీ సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సభల్లో పాల్గొనవలసిందిగా రాహుల్ గాంధీ, ప్రయాంకాను ఆహ్వానించనున్నట్లు సమాచారం.