- పేదలపై బుల్డోజర్లు నడిపిన కాంగ్రెస్ తోక కత్తరించాల్సిందే!
- జూబ్లీహిల్స్ నుంచే కాంగ్రెస్ అంతం ప్రారంభం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు.
ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు లాక్కుంటోందని సెటైర్లు వేశారు. ఉచిత బస్సుల పేరుతో భర్తల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఎన్నో ప్రజాక్షేమ పథకాలు విజయవంతంగా అమలయ్యాయని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో వేలాది కుటుంబాలకు సాయం అందించామని తెలిపారు. ఆడపిల్ల పుట్టితే రూ.13 వేల రూపాయలు, అబ్బాయి పుట్టితే రూ.12 వేల రూపాయలు అందించామన్నారు.
అయితే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ బంద్ చేశారని విమర్శించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్ట్ అన్నీ రద్దు చేసి ప్రజల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రజలనే బెదిరించే స్థాయికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో నాయకులు వాగ్దానాలు చేయడం సాధారణం అయినా, రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలకే హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీలు అమలు చేయకపోగా, “అన్ని పథకాలు బంద్ చేస్తాం” అంటూ ప్రజలను బెదిరించడం దారుణమని అన్నారు. రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చింది ప్రజలే, కానీ ఇప్పుడు ఆయన ప్రజలనే మర్చిపోయి రాజులా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ముకు కాపలా కాయాల్సిన వ్యక్తి ధర్మకర్తలా కాకుండా, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, “ఇందిరమ్మ రాజ్యం” పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తోందని, హైడ్రా–బుల్డోజర్ పేరుతో పేదలపై దౌర్జన్యం చూపుతోందని మండిపడ్డారు.
ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా, కేవలం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని, అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీ తోక కత్తరించే సమయం వచ్చిందని కేటీఆర్ పిలుపునిచ్చారు.
భర్త చనిపోయి మాగంటి సునీత బాధతో ఏడిస్తే, దానినీ డ్రామా అంటున్న కాంగ్రెస్ నేతలపై మహిళలు గట్టిగా ప్రతిస్పందించాలని కోరారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలంటే జూబ్లీహిల్స్ నుంచే ఆ జైత్రయాత్ర ప్రారంభం కావాలని అన్నారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

