ఐటిఐ కళాశాల, మైనార్టీ హాస్టల్ తరలింపును అడ్డుకొంటాం

ఐటిఐ కళాశాల, మైనార్టీ హాస్టల్ తరలింపును అడ్డుకొంటాం

వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో గోపిరెడ్డి ధర్నా

నరసరావుపేట, ఆంధ్రప్రభ : పట్టణ శివారు ములకలూరు గ్రామం వద్ద మైనార్టీల కోసం నిర్మించిన ఐటిఐ కళాశాల, హాస్టల్స్ ను కూటమి ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యుడు కేంద్రీయ విద్యాలయానికి అప్పజెప్పటాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ముస్లిం మైనార్టీ లతో కలిసి ఆయన ఐటిఐ కళాశాల వద్ద చేపట్టిన కార్యక్రమంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం సోదరుల కోసం నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేశారని, ఈ రిజర్వేషన్ సౌకర్యంతో ముస్లిం సోదరులు తమ పిల్లల చదువు మీద దృష్టి పెట్టి తమ పిల్లలను ఉన్నతస్థాయి చదువులు చదివించుకుంటున్నారని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మైనార్టీల సంక్షేమం కోసం అనేక ప్రాంతాల్లో మైనార్టీ ఐటిఐ కళాశాలలను హాస్టల్స్ ను నిర్మించారని వివరించారు. అందులో భాగంగా నరసరావుపేట ప్రాంతంలో ములకలూరు గ్రామం వద్ద ఐటిఐ కళాశాలను హాస్టల్స్ ను నిర్మించడం జరిగిందని, మా హయాంలో ప్రయత్నం చేసినప్పటికిని ప్రారంభించుకోలేకపోయామని, కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి రెండేళ్లు పూర్తయినా ఈ కళాశాల భవనాలను ప్రారంభించడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు.

నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఎస్పీ ఇక్కడ ఎస్పీ ఆఫీస్ పెట్టాలని ప్రయత్నం చేస్తే అప్పట్లో ఆ ప్రయత్నాలను మేము అడ్డుకొని మైనార్టీ సోదరుల కోసం కేటాయించిన భవనాలను మైనార్టీలకే చెందాలని అంకితభావంతో పనిచేశామని గుర్తు చేసారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంఈ భవనాలను కేంద్రీయ విద్యాలయానికి కేటాయించారని తెలిపారు.

మైనార్టీల భవనాలను కేంద్రీయ విద్యాలయానికి కేటాయించడానికి స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు ముందుగా అనుమతి ఇచ్చి ప్రస్తుతం తన పార్టీ వారిని కళాశాల భవనాల వద్ద ధర్నా చేయించి షో చేస్తున్నాడు అని, నిజంగా మైనార్టీల కోసం పాటుపడే వాడివైతే నీ అధికారాలను ఉపయోగించి ఎందుకు అడ్డుకోవట్లేదని ప్రశ్నించారు. తక్షణమే ఐటిఐ కళాశాలను హాస్టల్స్ను ప్రారంభించాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా మైనార్టీ నాయకులను సమీకరించి వేలాది మందితో ఉద్యమం నిర్వహిస్తామని గోపిరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply