వనపర్తి ప్రతినిధి, ఏప్రిల్ 17(ఆంధ్రప్రభ) : రోడ్ల విస్తరణలో భాగంగా పాతబజార్ కాళిమాత గుడిని పునర్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవడం పూర్వజన్మ సుకృతమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం పాతబజార్ శ్రీశ్రీశ్రీ దక్షిణ కాళికాంబ సమేత కమటేశ్వర స్వామి అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో భాగంగా గుడిని నిరంజన్ రెడ్డి సందర్శించారు. అనంతరం గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈసందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… వనపర్తి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రోడ్ల విస్తరణ చేయడం జరిగిందని, పాత బజార్ వీరాంజనేయ స్వామి, కాళిమాత గుడి అత్యంత ప్రశస్తమైన దేవాలయాలను వాటిని పునరుద్దరించడం సంతోషదాయకమన్నారు. దర్గాలను ప్రజల కోరిక మేరకు అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకోచ్చమని, సహకరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత మూడు రోజులుగా శ్రీశ్రీశ్రీ దక్షిణ కాళికాంబ సమేత కమటేశ్వర స్వామి దేవస్థానం నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను నిరంజన్ రెడ్డి అభినంధించారు. అమ్మవారి ఆశీస్సులతో మునుముందు వనపర్తి పట్టణాన్ని అన్ని వర్గాల ప్రజల సహకారంతో అభివృద్ధి చేసుకుందామని నిరంజన్ రెడ్డి చెప్పారు.