వెలగపూడి – ఎపీలో కూటమి సర్కార్ కు ప్రధాని మోడీ భారీ షాకిచ్చారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నిరుత్సాహ పరుస్తూ ఓ కీలకమైన పథకానికి బ్రేక్ వేశారు.
అసలే తెలంగాణ అభ్యంతరాలతో సతమతం అవుతున్న వేళ… కేంద్రం నిర్ణయం ఏపీకి శరాఘాతంగా మారబోతోంది. మరోవైపు కేంద్రం నిర్ణయంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కు భారీ ఊరట లభించిటనట్లయింది.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించింది. గత నెల 27న నిర్వహించిన ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ ఏపీ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తుల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తాజాగా దీనిపై విడుదల చేసిన మినిట్స్ లో పర్యావరణ అనుమతులు కోరే ముందు అక్కడ ఎలాంటి పనులు చేయలేదని పూర్తి ఆధారాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
అదే సమయంలో తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ చెన్నెలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ లో కేసు వేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు తొలిదశకు అనుమతులు అవసరం లేదని వాదించింది. దీంతో రెండో దశ పర్యావరణ అనుమతులకు మాత్రమే దరఖాస్తు చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర పర్యావరణ శాఖ ఏపీ ప్రభుత్వం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దరఖాస్తును తిరస్కరించింది. తద్వారా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరించింది.
ఈ నిర్ణయం ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారగా.. అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కు భారీ ఊరటనిచ్చింది. తమ ప్రభుత్వం నిరంతరాయంగా చేసిన ప్రయత్నాల ఫలితంగానే కేంద్రం ఈ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్ రాష్ట్ర నిబంధనలు ఉల్లంఘించి చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు నిరాకరించడం తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతులకు మేలు చేస్తుందన్నారు మంత్రి.