ప్రభుత్వమే దాడి చేయించింది…

ప్రభుత్వమే దాడి చేయించింది…
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రభుత్వం సినీఫక్కీలో పోలీసులతో కలిసి దుండగులతో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి చేయించిందని భీమవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి, కాపు నాయకుడు చినిమిల్లి వెంకట రాయుడు ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాపు నాయకులు ఆదివారం పరిశీలించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులను టార్గెట్ చేసిన ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైసీపీ నాయకులను, రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
ప్రశ్నించే నాయకులను అణిచి వేయాలని చూస్తున్న ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడతారని చెప్పారు. ప్రభుత్వ దోపిడీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కు కాపు సంఘం పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు.
