Recovery | చోరీకి గురైన 150 మొబైల్ ఫోన్లను రికవరీ…

Recovery | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సెల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అనేది కేవలం సమాచార సాధనం మాత్రమే కాదని, అందులో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, కీలకమైన డేటా ఉంటుందని ఎస్పీ తెలిపారు.

ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున, జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఒక ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో ఆర్ ఎస్ ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ బృందం సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి నెల సగటున 150కి పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ బాధితుల్లో నమ్మకాన్ని నింపుతోందని ఎస్పి వివరించారు.

గణాంకాలను వెల్లడిస్తూ, గత ఏడాదిలోనే సుమారు రూ.3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్పీ తెలిపారు. ఇటీవల చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత 20 రోజుల్లోనే రూ. 20.32 లక్షల విలువైన 127 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4,408 మొబైల్ ఫోన్లను గుర్తించి, సుమారు రూ. 7.05 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మొబైల్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని ఎస్పి అభినందించారు.

చివరగా, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, సిమ్ కార్డును బ్లాక్ చేసి, www.ceir.gov.in వెబ్‌సైట్‌లో ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయాలని కోరారు. మొబైల్ ద్వారానే సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున, గుర్తుతెలియని లింకులు, కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రికవరీ అయిన ఫోన్లను పొందేందుకు బాధితులు తమ వద్ద ఉన్న ధృవపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ ఎస్ ఐ బాలరాజు (ఫోన్: 8712686114) సంప్రదించి, తమ మొబైల్ ఫోన్లను తీసుకోవచ్చని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.

Leave a Reply