Records alert | ఇంగ్లాండ్ గడ్డపై రిషబ్ పంత్ కొత్త చరిత్ర

ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ మూడు రోజు ఆటలో రిషబ్ పంత్ మరో రికార్డు తన ఖాతాలోకి జత చేసుకున్నాడు. అతిథి జట్టు వికెట్ కీపర్‌గా ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పంత్ కొత్త రికార్డు నమోదు చేశాడు.

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పంత్ కేవలం 5 ఇన్నింగ్స్‌లలోనే 416 పరుగులు చేసి అగ్రస్థానానికి చేరాడు. ఇది ముందు వరకు న్యూజిలాండ్ వికెట్‌ కీపర్ టామ్ బ్లండెల్ పేరిట ఉండగా, అతను 2022లో 6 ఇన్నింగ్స్‌లలో 383 పరుగులు సాధించాడు. పంత్ స్వయంగా 2021–22 సిరీస్‌లో కూడా ఇంగ్లాండ్‌లో 349 పరుగులు చేసిన రికార్డు ఉంది, ధోని కూడా 2014లో ఇలాంటి ఘనత సాధించారు.

మూడో రోజు ‘మూవింగ్ డే’లో కేఎల్ రాహుల్ తో పాటు పంత్ తన ఇన్నింగ్స్ నిలకడగా కొనసాగించాడు. ఆత్మవిశ్వాసంతో ఆడి, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 86 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో పంత్‌కు 17వ హాఫ్ సెంచరీ కాగా, ఇంగ్లాండ్‌పై ఇది అతనికి 6వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

అయితే లంచ్‌కి కొన్ని నిమిషాల ముందు వేగంగా ఒక రన్ తీయాలని ప్రయత్నంలో పంత్ అనూహ్యంగా 74 పరుగుల వద్ద రన్‌ఔట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ డైరెక్ట్ హిట్‌తో రాహుల్–పంత్ జోడీ నిర్మించిన‌ 141 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పలికాడు.

కేవలం ఒక్క రికార్డు కాదు, పంత్ ఇంకో ఘనతను కూడా అందుకున్నాడు. ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా పంత్ తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇంగ్లాండ్ పై ఇప్పటివరకు 35 సిక్సర్లు బాదిన పంత్ అగ్ర‌స్థానంలో నిల‌వ‌గాజ… ఆ త‌రువాతి స్థానాల్లో వివియన్ రిచర్డ్స్ (34), టిమ్ సౌతీ (30), యశస్వి జైస్వాల్ (27), శుభ్మాన్ గిల్ (26) ఉన్నారు.

Leave a Reply