ఇఫ్తార్ విందు వేదిక మార్పు..

ఇఫ్తార్ విందు వేదిక మార్పు..

ఏ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో పవిత్ర రంజాన్ ఇఫ్తార్ విందు..
కార్యక్రమ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఈ నెల 16వ తేదీన పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ విందు కార్యక్రమం గతంలో నిర్ణయించిన విధంగా విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో కాకుండా ఏ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. రాష్ట్రస్థాయి ప్రభుత్వ సూచనల మేరకు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సంబంధించిన వేదిక మార్పు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఇఫ్తార్ విందు లో పాల్గొనే మత పెద్దలు ముస్లిం సోదరులు ప్రజాప్రతినిధులు వేదిక మార్పును గమనించి ఏ ప్లస్ కన్వెన్షన్ కు హాజరు కావాలని ఆయన కోరారు.

ఇందుకు సభందించి చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇఫ్తార్ విందుకు రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, వివిధ వర్గాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరు కానున్నారని ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

కార్యక్రమ వేదిక వద్ద పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, శుద్ధమైన తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, అతిథుల కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అతిథులు సౌకర్యవంతంగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తిచేయాలని తెలిపారు. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం నేపథ్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా, సోదరభావాన్ని పెంపొందించేలా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply