Rally | ఓటు హక్కు అత్యంత విలువైనది

Rally | మునుగోడు, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని తహసిల్దార్ నేలపట్ల నరేష్ తెలిపారు. ఈ రోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటర్ అవగాహన కోసం మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసిల్దార్ నేలపట్ల నరేష్ మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటు వేయడం ద్వారా మాత్రమే ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించగలరని, మంచి పాలనకు ఇది బలమైన పునాది అని అన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్, మండల విద్యాశాఖ అధికారి తలమల్ల మల్లేశం, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
