అకాల వర్షం.. రైతన్నకు నష్టం

అకాల వర్షం.. రైతన్నకు నష్టం

ఈదురుగాలులకు నేలకొరిగిన మొక్కజొన్న
పుల్లశెనగను కాపాడుకునేందుకు తంటాలు
చిలుకూరు, దాములూరు, కొటికలపూడిలో వడగళ్ల వాన
డ్రెయినేజీ అస్తవ్యస్తం.. రోడ్డు జలమయం

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మండల పరిధిలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో అకాల వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి పంటలు నేల వాలాయి. కొటికలపూడి గ్రామంలో పాలు దశలో ఉన్న మొక్కజొన్న నేలకొరిగింది. చిలుకూరు, దాములూరు, కొటికలపూడిలో వడగళ్ల వాన కురిసింది. చిలుకూరులో పుల్ల శనగపంట కోసి ఉంచడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పంట తడవకుండా ఉండేందుకు పట్టాలు కప్పారు. పల్లపు ప్రాంతంలో ఆరబోసిన శెనగ కిందకు వర్షపు నీరు చేరకుండా రైతులు కట్టలు వేశారు. పంటను కాపాడుకునేందుకు రైతులు వర్షంలో నానా అగచాట్లు పడ్డారు. ఈ అకాల వర్షం వల్ల మొక్కజొన్న రైతుకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

పొంగిన డ్రెయినేజీలు.. చెరువుల్లా రహదారులు

అకాల భారీ వర్షానికి పలు రహదారులు జలమయమయ్యాయి. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి సినిమా థియేటర్లకు వెళ్లే సర్వీస్ రోడ్డులో డ్రెయినేజీపై అక్రమ కట్టడాలు వల్ల సమయానికి డ్రెయినేజీ పూడిక తీయక భారీ వర్షానికి పొంగింది. ఆ రహదారి మొత్తం డ్రెయినేజీ నీటితో నిండి చెరువును తలపించింది. కొండపల్లి బ్యాంకు సెంటర్ లోని జామియా మసీదు వద్ద డ్రెయిన్ పొంగి రహదారిని ముంచెత్తింది. వాహనచోదకులు, పాదచారులు అవస్థలు పడ్డారు.

Leave a Reply