తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వాగులు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు పొంగిపొర్లడంతో.. రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ వరదలు మెదక్ జిల్లాలో ఒకేసారి అనేక ప్రమాదాలకు దారితీశాయి.
హవేలిఘన్‌పూర్ మండలం రాజిపేట తండా సమీపంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది వాగులో చిక్కుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ వారు వాగులో ఇరుక్కుపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
అదే సమయంలో, హవేలిఘన్‌పూర్ మండలం నాగ్‌పూర్ సమీపంలోని వాగులో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు బయటపడి ఓ చెట్టును పట్టుకుని ప్రాణ భయంతో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వరదల్లో 12 మంది చిక్కుకున్నారు. అయితే మొత్తం 12 మందిలో.. ఇద్దరు గల్లంతయ్యారు.

చెట్టును పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో కొట్టుకుపోయారు. మరో 10 మందిలో ఒకరిని ఇప్పటికే DRF బృందాలు రక్షించాయి, మిగిలిన తొమ్మిది మందిని రక్షించడానికి విస్తృతమైన ఆపరేషన్ జరుగుతోంది.
ఈ పరిణామాలపై జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును సంప్రదించి.. హెలికాఫ్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై స్పంధించిన ఛీఫ్ సెక్రటరీ వాతావరణం అనుకూలిస్తే హెలికాఫ్టర్‌ను పంపుతామని ఆయన భరోసా ఇచ్చారు.
మునిగిన ధూప్సింగ్ తండా..
జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా హావేలిఘనపూర్ మండలంలోని ధూప్‌సింగ్ తండా పూర్తిగా వరదలో మునిగిపోయింది. తండాలోని ఇళ్లన్ని జలమయమైంది. దీంతో తండా వాసులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇళ్ల మీదకు ఎక్కి.. సాయం కోసం ఎదురు చూడసాగారు. కాపాడాలని ఆర్తనాదాలు చేయసాగారు. తండా మొత్తం మునిగిపోవడంతో.. కాపాడే మార్గాలు మూసుకుపోయాయి. దీంతో తండావాసులు హెలికాప్టర్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఆపరేషన్ సక్సెస్…
కామారెడ్డి జిల్లా : భారీ వర్షాల కారణంగా తిమ్మారెడ్డి ప్రాంతంలోని కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగులో యల్లారెడ్డి మండలం బోగుగుడిసె గ్రామానికి చెందిన 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. ప్రాణభయంతో వారు డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూశారు. సమాచారం అందుకున్న వెంటనే TGSDRF బృందాలు, కామారెడ్డి పోలీసులు సమన్వయంతో రక్షాకార్యాచరణ చేపట్టి, ఆ 9 మందిని విజయవంతంగా రక్షించారు.
కాగా, గత 24 గంటల్లో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వరద ప్రభావంతో కామారెడ్డి – భిక్కనూర్ రైల్వే లైన్‌కి గండి పడటంతో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

మరో మూడు రోజులు
మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.
సీఎం సమీక్ష.. యంత్రాంగం అలర్ట్ !
భారీ వర్షాలతో ప్రభావితమైన మెదక్, కామారెడ్డి జిల్లాల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా తక్షణ చర్యలు తీసుకోవడానికి అన్ని విభాగాలు సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.